Taiwan: తైవాన్‌కు మేమున్నాం.. మళ్లీ కవ్వించిన బైడెన్‌..!

తైవాన్‌ విషయంలో చైనాలో గందరగోళం సృష్టించే పనులను అమెరికా చేస్తూనే ఉంది. తాజా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మరోసారి విజయవంతంగా గందరగోళం సృష్టించారు. ఊహించని

Updated : 19 Sep 2022 10:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తైవాన్‌ అంశంలో చైనాలో గందరగోళం సృష్టించే పనులను అమెరికా చేస్తూనే ఉంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మరోసారి విజయవంతంగా అస్పష్టతను కొనసాగించారు. ఊహించని దాడుల నుంచి తైవాన్‌ను తాము రక్షిస్తామని పునరుద్ఘాటించారు. ఆయన ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తైవాన్‌ రక్షణకు అమెరికా దళాలు వెళ్తాయా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి బైడెన్‌ నిస్సంకోచంగా ‘అవును’ అని తేల్చిచెప్పారు.  అంతేకాదు తైవాన్‌ స్వాతంత్ర్య కాంక్షను ప్రోత్సహించమని చెబుతూనే.. నిర్ణయం తైవాన్‌కు వదిలేశారు. ‘‘వన్‌ చైనా పాలసీ ఉంది.. మరో వైపు తైవాన్‌ తన స్వాతంత్ర్యంపై వాదనను వేరే విధంగా సమర్థించుకుంటోంది. మా వైఖరిలో మార్పులేదు. వారు స్వతంత్రులు కావడానికి మేం ప్రోత్సహించం. నిర్ణయం వారిష్టం’’ అని వ్యాఖ్యానించారు.

ఇక బైడన్‌ వ్యాఖ్యలు ఆదివారం ప్రసారం కాగానే.. శ్వేతసౌధం రంగంలోకి దిగింది. తమ వన్‌ చైనా పాలసీలో ఎటువంటి మార్పులు లేవని పునరుద్ఘాటించింది. ‘‘ఈ విషయాన్ని బైడెన్‌ గతంలో కూడా చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో టోక్యోలో కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. దీంతోపాటు తైవాన్‌ పాలసీలో మార్పులు లేవని కూడా చెప్పారు. ఇది నిజం’’ అని శ్వేతసౌధం ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి బైడెన్‌ తైవాన్‌కు సైనిక మద్దతు ఇస్తామని చెప్పడం.. ఆ తర్వాత శ్వేత సౌధం రంగంలోకి దిగి సర్దిచెప్పడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో కూడా ఒక సారి ఇలానే జరిగింది.

వాస్తవానికి తైవాన్‌పై దాడి చేస్తే అమెరికా ఎలా స్పందిస్తుందనేది చైనాకు అత్యంత కీలకమైన అంశం. ఈ విషయం వాషింగ్టన్‌కూ స్పష్టంగా తెలుసు. ఈ నేపథ్యంలో తన సైనిక ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది ఎప్పటికీ బహిర్గతంగా వెల్లడించదు. దీనిని ‘స్ట్రాటిజిక్‌ యాంబిగ్యుటీ’ (వ్యూహాత్మక అస్పష్టత)గా వ్యవహరిస్తారు. కొన్నేళ్లుగా దీన్ని కొనసాగిస్తోంది. అదే సమయంలో తైవాన్‌ స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించేలా హామీలు ఇచ్చి రెచ్చగొట్టదు.

ఈ నెల ప్రారంభంలో అమెరికా నుంచి 1.1 బిలియన్‌ డాలర్ల క్షిపణులు, ఇతర ఆయుధాలను తైవాన్‌కు ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది. ఈ చర్యతో చైనాను కవ్వించినట్లైంది. దీనికి తోడు ఆగస్టులో హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటన తర్వాత అమెరికా-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని