Ukraine Crisis: పుతిన్‌-బైడెన్‌ భేటీకి రంగం సిద్ధం..!

ఉక్రెయిన్‌ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భేటీ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ భేటీ కోసం ఇప్పటికే బైడెన్‌ సూత్రప్రాయంగా అంగీకరించారు.

Updated : 21 Feb 2022 12:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భేటీ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ భేటీ కోసం ఇప్పటికే బైడెన్‌ సూత్రప్రాయంగా అంగీకరించారు. ఫ్రాన్స్‌ ప్రతిపాదించిన ఈ సదస్సు జరగాలంటే.. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణకు పాల్పడి ఉండకూడదని శ్వేతసౌధం పేర్కొంది. ఈ చర్చలు ఐరోపాలోని అతిపెద్ద భద్రతా సంక్షోభానికి దౌత్య పరిష్కారాలను సూచిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ చర్చల విషయాన్ని ఫ్రాన్స్‌ కూడా ధ్రువీకరించింది.

సుదీర్ఘ చర్చల అనంతరం..

ఈ చర్చలకు రంగం సిద్ధం చేయడంలో ఫ్రాన్స్‌ కీలక పాత్ర పోషించింది. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌ .. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో రెండుసార్లు సుదీర్ఘమైన ఫోన్‌కాల్స్‌లో మాట్లాడారు. ఈ చర్చలు దాదాపు మూడు గంటలపాటు జరిగినట్లు సమాచారం.  ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ అమెరికా-నాటోలు సెక్యూరిటీ గ్యారెంటీ కోసం చేస్తున్న డిమాండ్లపై సీరియస్‌గా ఉండాలని పునరుద్ఘాటించారు. సోమవారం మాక్రోన్‌ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు కాల్‌ చేసి దాదాపు 15 నిమిషాలు మాట్లాడారు. బైడెన్‌-పుతిన్‌ భేటీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు గురువారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ సమావేశం కానున్నారు.

శాంతి ప్రయత్నాలకు కట్టుబడి ఉన్నాం: ఉక్రెయిన్‌

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీతో కూడా ఫోన్‌కాల్‌లో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని జెలెన్స్కీ ట్విటర్‌లో వెల్లడించారు. కొత్తగా కవ్వింపు చర్యల్లో భాగంగా జరుగుతోన్న షెల్లింగ్‌పై కూడా మాక్రోన్‌కు వివరించినట్లు పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారీ సంఖ్యలో ఉల్లంఘిస్తున్నారని ఆర్గనైజేషన్‌ ఫర్‌ సెక్యూరిటీ అండ్‌ కోపరేషన్‌ ఇన్‌ యూరప్‌ (ఓఎస్‌సీఈ) పేర్కొంది. 

కొనసాగుతున్న సేనల మోహరింపు..

మరోపక్క రష్యా మోహరింపులు ఎక్కడా ఆగిన సూచనలు కనిపించడంలేదు. తాజాగా అమెరికా కంపెనీ మాక్సర్‌ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం కొత్తగా రష్యా మోహరింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఐరోపాలో 1,90,000 మంది సైనికులను మోహరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని