USA: లక్షల మంది వలసదారులకు అమెరికా పౌరసత్వం

ప్రస్తుత సంవత్సరంలో లక్షల మంది వలసదారులకు మేలు చేసే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీసుకున్నారు.

Published : 19 Jun 2024 06:22 IST

వాషింగ్టన్‌: ప్రస్తుత సంవత్సరంలో లక్షల మంది వలసదారులకు మేలు చేసే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీసుకున్నారు. అమెరికా పౌరులను పెళ్లి చేసుకుని కూడా చట్టబద్ధ హోదా లేకుండా అమెరికాలో నివసించాల్సి వస్తున్న వారికి శాశ్వత నివాస హక్కు, అమెరికా పౌరసత్వం అందించాలని నిర్ణయించారు. అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని పెళ్లాడినవారికి పుట్టిన పిల్లల్లో 50,000 మందికి కూడా ఇదే వసతి లభిస్తుంది. అధ్యక్ష భవనం శ్వేతసౌధం మంగళవారం చేసిన ప్రకటనతో దాదాపు 5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిన పురుషులు లేదా మహిళలు అమెరికా  పౌరులను పెళ్లాడిన తరవాత ఈ సోమవారం (జూన్‌ 17) నాటికి పదేళ్లుగా అమెరికాలో నివసించి ఉండాలి. సోమవారం దాటిన తరవాత పదేళ్లు నిండేవారికి ఈ సౌకర్యం లభించదు. అర్హులైనవారి దరఖాస్తు ఆమోదం పొందిన మూడేళ్లలో గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి తాత్కాలిక పని పర్మిట్‌ లభిస్తుంది. ఈ మూడేళ్లలో వారిని స్వదేశాలకు తిప్పిపంపరు. అమెరికా పౌరులను పెళ్లాడినా ఆ దేశ పౌరసత్వం లభించనివారు 11 లక్షల మంది వరకు ఉంటారు. వీరిలో అర్హులైనవారికి పౌరసత్వం లభించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని