Biden: నేతలంతా ఒకవైపు.. బైడెన్‌ మరోవైపు: వైరల్‌గా అధ్యక్షుడి వ్యవహారశైలి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి వార్తల్లో నిలిచారు. జీ7 సదస్సు వేళ..ఇటలీలో ఆయన వ్యవహారశైలి వైరల్‌గా మారింది. 

Updated : 14 Jun 2024 18:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటలీ (Italy)లోని అపూలియా ప్రాంతంలో జీ7 సదస్సు (G7 Summit) జరుగుతోంది. ఈ గ్రూప్ సభ్య దేశాల అధినేతలతో పాటు పలు ఆహ్వానిత దేశాల నాయకులు దీనికి హాజరయ్యారు. మన ప్రధాని నరేంద్రమోదీ కూడా గురువారం రాత్రే ఇటలీలో అడుగుపెట్టారు. ఈ అంతర్జాతీయ సదస్సులో తన వ్యవహారశైలితో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

జీ7కి వచ్చిన నేతలంతా గ్రూప్‌ ఫొటోకు పోజు ఇచ్చారు. ఆ సమయంలో బైడెన్ (Joe Biden) మాత్రం నేతలు ఉన్నవైపు కాకుండా మరోవైపు తిరిగి, ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా ముందుకు వెళ్లారు. అలాగే ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు. ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆ నిల్చున్న వైపు ఎవరూ లేరు. ఎంతసేపటికీ ఆయన గ్రూప్‌ ఫొటో దిగేందుకురాకపోవడంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వెళ్లి ఆయన్ను తీసుకువచ్చారు. దీంతో 81 ఏళ్ల బైడెన్‌ నేతలతో కలిసి ఫొటో దిగారు. ఈ ఘటనను వీక్షించిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు.

అమెరికా ఎన్నికల్లో జోక్యానికి ప్రత్యర్థి దేశాల ప్రయత్నాలు

కొన్నాళ్ల క్రితం వైట్‌హౌస్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అధ్యక్షుడి ప్రవర్తన ఇలాగే ఉంది. ఆయన చుట్టూ ఉన్నవారంతా అక్కడ వినిపిస్తున్న సంగీతానికి తగ్గట్టుగా కాలుకదుపుతుంటే.. బైడెన్ మాత్రం కొంతసేపు అలాగే నిల్చుండిపోయారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఇలాంటి దృశ్యాలు ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి అస్త్రాలుగా మారుతున్నాయి. వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల బైడెన్ (Biden) జ్ఞాపకశక్తిలో లోపాలను గుర్తించినట్లు గతంలో ఒక నివేదిక విడుదలైన సంగతి తెలిసిందే.

అధ్యక్షుడి జ్ఞాపకశక్తి చాలా ‘‘మసక’’గా, ‘‘మబ్బు’’గా ఉందని నివేదిక పేర్కొంది. జీవితంలోని కీలక సంఘటనలను సైతం ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని తెలిపింది. కుమారుడు బ్యూ బైడెన్‌ ఎప్పుడు చనిపోయారనే విషయమూ జ్ఞప్తికి రాలేదని పేర్కొంది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని తెలిపింది. ఈ నివేదికను ఆయన తీవ్రంగా ఖండించారు. అయితే ఇవన్నీ డెమోక్రాటిక్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు