Ukraine Crisis: ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సాయం.. రూ.2.63 వేల కోట్లు విడుదల

రష్యా ముప్పేట దాడితో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరవుతోన్న విషయం తెలిసిందే. రష్యా బలగాలను ఎదుర్కొనేందుకు తమకు సైనిక సాయం అందించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి సైతం చేశారు. ఈ క్రమంలోనే రష్యా దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్‌కు రూ.26 వేల కోట్ల సైనిక సాయాన్ని...

Published : 26 Feb 2022 14:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా ముప్పేట దాడితో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరవుతోన్న విషయం తెలిసిందే. రష్యా బలగాలను ఎదుర్కొనేందుకు తమకు సైనిక సాయం అందించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే రష్యా దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్‌కు రూ.2.63 వేల కోట్ల సైనిక సాయాన్ని విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించారు. విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌కు జారీ చేసిన మెమోరాండంలో.. విదేశీ సహాయ చట్టం ద్వారా రూ.2.63 వేల కోట్లను ఉక్రెయిన్ రక్షణ కోసం కేటాయించాలని ఆదేశించారు. మరోవైపు ఉక్రెయిన్‌కు రూ.10.16 వేల కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ఈయూ నిర్ణయించినట్లు ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్‌ మెక్రాన్‌ తెలిపారు. అంతకుముందు తనను కీవ్‌ నుంచి సురక్షిత ప్రాంతానిక తరలిస్తామంటూ అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. మిత్ర దేశాల నుంచి తమకు ఆయుధాలు, సామగ్రి సరఫరా అవుతోన్నట్లు చెప్పారు.

మరోవైపు.. రష్యా ప్రభుత్వంపై కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చిన అగ్రరాజ్యం.. తాజాగా అధ్యక్షుడు పుతిన్‌, విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌పై వ్యక్తిగత ఆంక్షలకు సిద్ధమైంది. ఈ ఇద్దరి ఆస్తులను స్తంభింపజేసేందుకు ఈయూ శుక్రవారమే నిర్ణయించిన విషయం తెలిసిందే. రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిసినప్పటికీ.. పుతిన్ ఆక్రమణ దిశగా అడుగులు వేశారని అమెరికా భావిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రతినిధి జెన్‌ సాకీ తెలిపారు. ఇది పూర్తిగా పుతిన్ నిర్ణయమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యావత్తు ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చి రష్యా చర్యలను వ్యతిరేకించాల్సిన బాధ్యత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా సహా ఇతర దేశాలు విధిస్తున్న కఠిన ఆంక్షలతో రష్యా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే రష్యన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 11 మంది ఉన్నతాధికారులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని