Joe Biden: నాటకాలు ఆపండి..! సొంత పార్టీ నేతలపై బైడెన్‌ ఆగ్రహం

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తాను ఉండాలా? వద్దా? అనే దానిపై పార్టీలో అంతర్గతంగా సాగిస్తున్న నాటకాలకు ముగింపు పలకాలని డెమోక్రాట్లను ఉద్దేశించి జో బైడెన్‌ లేఖ రాశారు.

Published : 09 Jul 2024 00:05 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్ (Joe Biden) వైదొలగాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. సొంత పార్టీ నేతలే చాలామంది ఆయన నిష్క్రమించాలని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే, తాను వైదొలిగే ప్రసక్తే లేదని బైడెన్‌ మరోసారి స్పష్టం చేశారు. తాను రేసులో ఉండాలా? వద్దా? అనే దానిపై పార్టీలో అంతర్గతంగా సాగిస్తున్న నాటకాలకు ముగింపు పలకాలని డెమోక్రాట్లపై లేఖాస్త్రం సంధించారు. వారం రోజులుగా ఈ అంశంపై చర్చోపచర్చలు సాగిస్తున్నారని.. వాటికి తెరదించే సమయం వచ్చిందన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)ను ఓడించడమే పార్టీ ముందున్న ఏకైక లక్ష్యమన్నారు.

‘‘డెమోక్రాటిక్‌ కన్వెన్షన్‌కు 42 రోజుల సమయం ఉంది. మరో 119 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇటువంటి కీలక సమయంలో పార్టీ సంకల్పం బలహీనపడటం, ఎలా వ్యవహరించాలనేదానిపై స్పష్టత లేకపోవడం.. కేవలం ట్రంప్‌నకే మేలు చేకూరుస్తుంది. మనం నష్టపోతాం. మనమంతా ఏకతాటిపైకి వచ్చే, ఐక్యంగా ముందుకు సాగే, ట్రంప్‌ను ఓడించే సమయం ఆసన్నమైంది’’ అని బైడెన్‌ తన లేఖలో పేర్కొన్నారు. అనంతరం ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సామాన్య డెమోక్రాట్‌లు తాను రేసులో ఉండాలనే కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్టీలో కొంతమంది బడా నేతలు ఏమనుకుంటున్నారో పట్టించుకోనన్నారు. తనను తప్పించాలన్న వాదనలతో విసిగిపోయానని, ఒకవేళ ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నట్లయితే డెమోక్రాటిక్‌ కన్వెన్షన్‌లో తన అభ్యర్థిత్వాన్ని ప్రశ్నించాలని సవాలు విసిరారు.

బలపడుతున్న బైడెన్‌పై వ్యతిరేకత.. కమలా హ్యారిస్‌కు పెరుగుతున్న మద్దతు

ట్రంప్‌తో సంవాదంలో బైడెన్‌ తడబడిన తర్వాత ఆయన అభ్యర్థిత్వంపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీంతో దీనిపై ఓ స్పష్టతకు వచ్చేలా కీలక నేతలతో ప్రతినిధుల సభలోని మైనారిటీ నేత హకీం జెఫరీస్‌ ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతినిధుల సభలో మళ్లీ మెజారిటీ సాధించాలంటే బైడెన్‌ పోటీలో ఉండొద్దని పలువురు కీలక నేతలు అభిప్రాయపడ్డట్లు సమావేశంలో పాల్గొన్న వర్గాలు వెల్లడించాయి. ఆయన వల్ల అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నడుమ బైడెన్‌ తాజా లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని