Biden: జెలెన్‌స్కీపై బైడెన్‌ అసహనం..!

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఓ సందర్భంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌కు అవసరమైన ఆయుధాల జాబితా  ఆయన్ను అసహనానికి గురిచేసింది.

Published : 02 Nov 2022 01:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అసహనం వ్యక్తం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌ 15వ తేదీన బిలియన్‌ డాలర్ల మానవీయ, సైనిక సాయం ఇచ్చే విషయాన్ని చెప్పేందుకు జెలెన్‌స్కీకి బైడెన్‌ ఫోన్‌ చేశారు. ఈ క్రమంలో బైడెన్‌ వివరాలు చెప్పటం ముగించాక.. ఉక్రెయిన్‌కు ఇంకా కావాల్సిన పరికరాల జాబితాను జెలెన్‌స్కీ చెప్పటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అసహనానికి గురైన బైడెన్‌ స్వరం పెంచి.. ‘కొంచెం కృతజ్ఞత చూపించండి’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది.

ఉక్రెయిన్‌కు సాయం మంజూరు అయినప్పుడల్లా సాధారణంగా బైడెన్‌ స్వయంగా ఫోన్‌ చేసి ఆ వివరాలను జెలెన్‌స్కీకి వివరించారు. 2022లో అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు ఉక్రెయిన్‌కు కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ రిపోర్టు వెల్లడిస్తోంది. అమెరికా ఇచ్చిన ఆయుధాల్లో హైమార్స్‌ రాకెట్‌ సిస్టమ్‌, స్టింగర్‌, జావెలిన్‌ క్షిపణలు, ఎం-17 హెలికాప్టర్లు ఉన్నట్లు పెంటగాన్‌ నివేదికలు చెబుతున్నాయి. జనవరి నుంచి ఆగస్టు వరకు అమెరికా నుంచి 8.79 బిలియన్‌ డాలర్ల సాయం అందింది. అంతేకాదు.. ఉక్రెయిన్‌ సైన్యానికి అవసరమైన శిక్షణ, ఇంటెలిజెన్స్‌ వంటివి కూడా అమెరికా నుంచి అందుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని