Biden: మేం ముందే హెచ్చరించాం.. జెలెన్‌స్కీనే వినలేదు..!

రష్యా చేస్తోన్న దురాక్రమణ ఉక్రెయిన్‌కు తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలను తెచ్చిపెడుతోంది.

Published : 12 Jun 2022 02:08 IST

వాషింగ్టన్: రష్యా చేస్తోన్న దురాక్రమణ ఉక్రెయిన్‌కు తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలను తెచ్చిపెడుతోంది. అయితే.. అసలు ఈ దాడి గురించి అమెరికా చేసిన ముందస్తు హెచ్చరికలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ వినడానికి ఇష్టపడలేదట. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా వెల్లడించారు. లాస్‌ఏంజెల్స్‌లో నిధుల సమీకరణ నిమిత్తం జరిగిన కార్యక్రమంలో భాగంగా నాలుగు నెలలనాటి పరిణామాలను వివరించారు.

‘రష్యా దాడి గురించి నేను ముందస్తుగా చేసిన హెచ్చరికలను అతిశయోక్తిగా చేసిన ప్రకటన అని చాలామంది భావించారు. అది నాకు తెలుసు. కానీ మాకున్న సమాచారం ఆధారంగా మేం వెల్లడించాం. ఆయన (పుతిన్‌ను ఉద్దేశించి) సరిహద్దుల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే జెలెన్‌స్కీ ఈ విషయాన్ని వినేందుకు ఇష్టపడలేదు. ఇంకా చాలామంది వినలేదు. వారు ఎందుకు వినకూడదనుకుంటున్నారో నాకు అర్థమైంది. కానీ ఆయన అప్పటికే వెళ్లిపోయారు’ అంటూ బైడెన్ వెల్లడించారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక సైనిక చర్యను ప్రకటించకముందే.. రష్యా సైనిక సన్నద్ధతపై అమెరికా హెచ్చరికలు చేసింది. తేదీతో సహా యుద్ధం ప్రారంభమయ్యే రోజును పేర్కొంది. కాకపోతే తేదీలో మార్పు జరిగినా..అంచనా వేసినట్టుగానే పుతిన్‌ సేనలు దురాక్రమణకు దిగాయి. అమెరికా హెచ్చరికలను ఐరోపా మిత్రదేశాలు కూడా కొన్ని నమ్మలేదు. అమెరికా మరీ ఎక్కువ ముందు జాగ్రత్త పడుతోందని అంతా భావించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని