Nato summit: ఉక్రెయిన్‌కు ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు ఇస్తాం: నాటో సదస్సులో బైడెన్‌

ఉక్రెయిన్‌కు అత్యంత కీలకమైన ఆయుధాలను అందించేందుకు అమెరికా సంసిద్ధత వ్యక్తంచేసింది. మిత్ర దేశాలతో ఈ దిశగా చర్యలు చేపడతామని అధ్యక్షుడు జోబైడెన్‌ నాటో సదస్సులో ప్రకటించారు. 

Published : 10 Jul 2024 14:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా భీకర దాడులతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్‌కు తాము ఐదు వ్యూహాత్మక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించారు. వాషింగ్టన్‌లో జరుగుతున్న నాటో దేశాధినేతల సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన ఈవిషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ సైనిక కూటమి ఎన్నడూ లేనంత శక్తిమంతంగా ఉందని ఆయన అభివర్ణించారు. అదే సమయంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పుడు పెనుమార్పు చోటుచేసుకొనే దశను ఎదుర్కొంటోందని తెలిపారు. 

ఉక్రెయిన్‌కు పేట్రియాట్‌, ఇతర ఆయుధ వ్యవస్థలను సరఫరా చేసేందుకు జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌, రొమానియాతో కలిసి పనిచేస్తామని బైడెన్‌ వివరించారు. ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని బైడెన్‌ జోస్యం చెప్పారు. ఉక్రెయిన్‌ కచ్చితంగా సురక్షితంగా ఉంటుందని.. రష్యాకు మాత్రం రక్షణ లేదని వ్యాఖ్యానించారు. 13 నిమిషాలపాటు బైడెన్‌ ఎటువంటి తడబాటు లేకుండా ప్రసంగించారు. ఈ సదస్సుకు  32 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 

ఉక్రెయిన్‌లో అమాయక ప్రజల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకొన్నారు. దీనిప్రకారం ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలతోపాటు.. వ్యూహాత్మకమైన యాంటీ ఎయిర్‌ బ్యాటరీస్‌ను నాటో కీవ్‌కు సరఫరా చేయనుంది.  

గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పశ్చిమదేశాలను ఆయుధాల కోసం పలుమార్లు అభ్యర్థించారు. ఇటీవలే రష్యా క్షిపణి ఒకటి రాజధాని కీవ్‌లోని పిల్లల ఆసుపత్రిని ధ్వంసం చేసిన రెండ్రోజుల్లోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. యుద్ధం మొదలైన నాటినుంచి జరిగిన అతి ఘోరమైన దాడిగా దీనిని ఆ నగర మేయర్‌ అభివర్ణించారు. ఒక్క సోమవారం రోజే రష్యా చేసిన దాడుల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు