Joe Biden: ఉక్రెయిన్‌లో జీవాయుధాల వినియోగానికి.. అదే స్పష్టమైన సంకేతం..!

ఉక్రెయిన్‌లో రసాయన, జీవాయుధాలు ఉన్నాయంటూ రష్యా చేస్తోన్న ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి తోసిపుచ్చారు.

Published : 23 Mar 2022 01:51 IST

మరోసారి హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

కీవ్‌: సైనిక చర్య పేరుతో రష్యా చేస్తోన్న భీకర దాడులతో ఉక్రెయిన్‌ నగరాలు వణికిపోతున్నాయి. కీవ్‌, మేరియుపోల్‌ వంటి ప్రధాన నగరాలను హస్తగతం చేసుకునేందుకు భారీ క్షిపణులతో తెగబడుతోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్‌లో రసాయన, జీవాయుధాలు ఉన్నాయంటూ ఆరోపణలూ చేస్తోంది. ఇలా రష్యా చేస్తోన్న ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి తోసిపుచ్చారు. ఇటువంటి జీవ, రసాయన ఆయుధాలను ఉక్రెయిన్‌పై ప్రయోగించేందుకు పుతిన్‌ చేస్తోన్న ప్రయత్నాలకు ఇదే స్పష్టమైన సంకేతమని జో బైడెన్‌ స్పష్టం చేశారు.

‘యూరప్‌లో రసాయనిక, జీవాయుధాలపై ప్రయోగాలు చేస్తున్నామంటూ రష్యా తప్పుడు ఆరోపణలు మొదలుపెట్టింది. అటువంటివి పూర్తి అవాస్తవం. అంతేకాకుండా ఉక్రెయిన్‌ వద్ద జీవ, రసాయన ఆయుధాలు ఉన్నాయంటూ రష్యా చెబుతోంది. వీటిని చూస్తుంటే ఆ రెండింటినీ ఉపయోగించే యోచనలో రష్యా ఉందని చెప్పడానికి ఇదే స్పష్టమైన సంకేతం’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌లో జీవాయుధాలపై ఒక ప్రైవేటు కంపెనీతో కలిసి అమెరికా రక్షణశాఖ పరిశోధనలు సాగిస్తున్నాయని రష్యా రక్షణశాఖ ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది. అక్కడ 30 జీవశాస్త్ర ప్రయోగశాలలను కనుగొన్నామని పేర్కొంది. అందుకే కీవ్‌లోని ప్రయోగశాలల ఆనవాళ్లు దొరక్కుండా అమెరికా, ఉక్రెయిన్‌లు ప్రయత్నాలు చేశాయని ఆరోపించింది. ముఖ్యంగా ప్లేగు, ఆంథ్రాక్స్‌, కలరా వంటి ప్రమాదకర వ్యాధులను కలిగించే సూక్ష్మజీవుల జన్యువుల్లో కృత్రిమంగా మార్పుచేర్పులు చేసి జీవాయుధాలుగా మార్చడానికి ఉక్రెయిన్‌లోని ప్రయోగశాలల్లో పరిశోధనలు జరిగాయని పేర్కొంది. ఇలా రష్యా చేస్తోన్న ఆరోపణలను ఖండించిన అమెరికా.. కేవలం ఉక్రెయిన్‌లో వాటిని ప్రయోగించేందుకే రష్యా ఇటువంటి వాదనను తెరమీదకు తెస్తోందని దుయ్యబట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని