Joe Biden: సైనిక చర్యలో రష్యా పక్షాన చైనా..? ఆధారాల్లేవన్న బైడెన్‌!

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా పక్షాన చైనా నిలుస్తుందనడానికి ఆధారాలు లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. మరోవైపు.. ఉక్రెయిన్‌పై పుతిన్‌ అణ్వాస్త్రాలు వినియోగించకుండా నిరోధించడంలో భారత్, చైనాల ప్రభావం కూడా పని చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ వెల్లడించారు.

Published : 25 Feb 2023 19:18 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) దండయాత్ర కొనసాగుతోన్న వేళ.. మాస్కోకు చైనా(China) నుంచి కీలక మద్దతు వెళ్లే అవకాశం ఉందని అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. రష్యా కొత్తగా దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండటంతో చైనా నుంచి ప్రమాదకర ఆయుధాలను అక్కడికి తరలించవచ్చని భావిస్తున్నట్లు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌(Antony Bliken) ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ సైనిక చర్య విషయంలో చైనా.. రష్యా పక్షాన నిలుస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తాజాగా తెలిపారు.

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా పక్షాన చైనా నిలుస్తుందని ఆందోళన చెందుతున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బైడెన్‌ ఈ మేరకు స్పందించారు. ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. ఈ విషయమై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇప్పటికే మాట్లాడినట్లు వెల్లడించారు. మరోవైపు.. రష్యాకు చైనా ఆయుధ సాయం అందించడాన్ని చూడలేదని పెంటగాన్ సైతం పేర్కొంది. అధునాతన ఆయుధ సామర్థ్యాలు కలిగి ఉన్న చైనా.. ఉక్రెయిన్‌ విషయంలో తన తటస్థతను బహిరంగంగానే ప్రకటించిందని పెంటగాన్ ప్రెస్ సెక్రెటరీ ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ గుర్తుచేశారు.

‘భారత్‌, చైనాల ప్రభావం కూడా కారణమే..’

ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అణ్వస్త్రాలు ప్రయోగించే అవకాశం లేకపోలేదన్న వార్తలు గతంలో చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ విషయంలో రష్యా వెనకడుగుకు భారత్‌, చైనాల బలమైన ప్రభావం కూడా కారణమై ఉండొచ్చని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ పేర్కొన్నారు. లేనిపక్షంలో, యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్‌ ఇప్పటికే అణ్వాయుధాలను ప్రయోగించి ఉండొచ్చన్నారు. ‘యుద్ధభూమిలో అణ్వాయుధాల వినియోగాన్ని వ్యతిరేకించడంలో భారత్‌, చైనాలు.. రష్యాపై కొంచెం ఎక్కువ ప్రభావం చూపాయి’ అని బ్లింకెన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్‌, రష్యాల మధ్య దశాబ్దాల బంధం ఉందని పేర్కొంటూనే, కొన్నేళ్లుగా భారత్‌.. అమెరికా, ఫ్రాన్స్‌లవైపు సైతం మొగ్గుచూపుతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని