Biden - Xi Jinping: రంగంలోకి బైడెన్‌.. జిన్‌పింగ్‌కు ఫోన్‌..!

ఉక్రెయిన్‌పై సాగిస్తోన్న యుద్ధంలో రష్యాకు చైనా సహకారం అందిస్తోందని గత కొన్ని రోజులుగా అమెరికా ఆరోపణలు చేస్తోన్న

Published : 18 Mar 2022 12:50 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై సాగిస్తోన్న యుద్ధంలో రష్యాకు చైనా సహకారం అందిస్తోందని గత కొన్ని రోజులుగా అమెరికా ఆరోపణలు చేస్తోన్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకోనుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శుక్రవారం ఫోన్లో మాట్లాడనున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడంలో భాగంగా ఈ ఫోన్‌ కాల్‌ చేయనున్నట్లు వైట్‌ హౌజ్‌ మీడియా కార్యదర్శి జెన్‌ సాకీ వెల్లడించారు. అమెరికా, చైనా మధ్య నెలకొన్న ఆర్థిక వివాదంతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధంపైనా ఇరువురు నేతలు చర్చించనున్నట్లు సమాచారం. 

ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా.. చైనా నుంచి సైనిక సాయం కోరినట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనా గనుక రష్యాకు సాయం చేస్తే ఆ తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే అగ్రరాజ్యం హెచ్చరించింది. గత సోమవారం ఇటలీలోని రోమ్ వేదికగా వైట్ హౌజ్‌ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్, చైనా విదేశాంగ విధాన సలహాదారు యాంగ్‌ జిచి సమావేశమై ఉక్రెయిన్‌ పరిస్థితులపై చర్చించారు. ఈ భేటీలో అమెరికా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది. రష్యా విషయంలో బీజింగ్‌ మరింత పారదర్శకంగా వ్యవహరించాలని, రష్యాకు సాయం చేయాలని చూస్తే జిన్‌పింగ్‌ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో స్వయంగా బైడెన్‌ రంగంలోకి దిగుతున్నారు. జిన్‌పింగ్‌కు ఫోన్‌ చేసి రష్యా తీరుపై చర్చించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని