USA: పాలస్తీనా చిన్నారిని చంపేందుకు యత్నం.. తీవ్రంగా ఖండించిన బైడెన్

అమెరికా(USA)లో పాలస్తీనా అనుకూల నిరసనలు జరుగుతోన్న తరుణంలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటనపై బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 

Updated : 25 Jun 2024 11:04 IST

వాషింగ్టన్: గాజా పోరులో ఇజ్రాయెల్‌ (Israel)కు మద్దతుగా జో బైడెన్‌ (Joe Bidn) ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా(USA)లో పాలస్తీనా అనుకూలురు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. ఈనేపథ్యంలో టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ వ్యవహరించిన తీరు తీవ్ర ఆందోళన కలిగించింది. పాలస్తీనియన్-అమెరికన్ సంతతికి చెందిన బిడ్డను ఒక కొలనులో ముంచి చంపేందుకు యత్నించిందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై అధ్యక్షుడు బైడెన్‌ స్పందించారు.

యుద్ధాన్ని ఆపే ఏ ఒప్పందాన్నీ అంగీకరించం

ఎలిజబెత్ వోల్ఫ్ అనే మహిళ డల్లాస్‌ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లోని స్విమ్మింగ్ పూల్ వద్ద నిల్చున్న మరో మహిళ వద్దకు వెళ్లింది. ఆమె పక్కన ఉన్న ఇద్దరు చిన్నారులను చూసి, వీరు ఎవరి పిల్లలని ప్రశ్నించింది. హిజాబ్ ధరించి ఉన్న సదరు మహిళపై ఎలిజబెత్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసింది. అక్కడితో ఆగకుండా ఒక చిన్నారిని నీటిలో ముంచి చంపేందుకు యత్నించిందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘పాలస్తీనియన్-అమెరికన్ సంతతికి చెందిన మూడేళ్ల చిన్నారిని చంపేందుకు యత్నించారంటూ వచ్చిన వార్తలు తీవ్ర కలతకు గురిచేశాయి. ఏ బిడ్డ హింసాత్మక దాడికి గురికాకూడదు’’ అంటూ ఆ ఘటనను ఖండించారు. ఎలిజబెత్‌పై పోలీసులు హత్యాభియోగాలు నమోదు చేశారు. 

జీప్‌ బానెట్‌పై పాలస్తీనా పౌరుడిని కట్టి..

ఒక జీప్ బానెట్‌పై గాయపడిన పాలస్తీనా పౌరుడిని కట్టి ఉంచిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అది ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన మిలిటరీ జీప్ అని తెలుస్తోంది. ఈ దారుణం గురించి అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్‌కు ప్రశ్న ఎదురైంది. ఇది పాలస్తీనియన్లను మానవకవచంగా ఉపయోగించడం కాదా..? అని ఓ రిపోర్టర్‌ ప్రశ్నించారు. దీనికి మిల్లర్ స్పందిస్తూ..‘‘ ఆ వీడియో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎప్పటికీ మనుషుల్ని మానవ కవచాలుగా వాడకూడదు. ఇజ్రాయెల్ సైన్యం దీనిపై వెంటనే విచారణ జరిపించాలి’’ అని అగ్రదేశం తన వైఖరి స్పష్టంచేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని