ఆసీస్‌కు నో చెప్పి, చైనాకు గిఫ్ట్ ఇస్తున్నారా..? క్వాడ్‌ సదస్సు రద్దుపై బైడెన్‌పై విమర్శలు

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పడిన క్వాడ్‌ కూటమి సదస్సు(Quad summit) ఈ ఏడాది నిలిచిపోయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరుకాలేనని చెప్పడంతో ఇది రద్దయింది. 

Published : 18 May 2023 18:44 IST

కాన్‌బెర్రా: వచ్చేవారం ఆస్ట్రేలియాలో జరగనున్న క్వాడ్‌ సమ్మిట్‌(Quad summit)కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(US President Joe Biden)హాజరుకానని చెప్పడంతో.. అది కాస్తా రద్దయింది. తన సొంత నగరమైన సిడ్నీలో మూడు శక్తివంతమైన దేశాధినేతలకు(అమెరికా, జపాన్‌, భారత్) ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌(Australian Prime Minister Anthony Albanese)కు ఇది ఎదురుదెబ్బ అని అంతర్జాతీయ కథనాలు అభివర్ణించాయి. క్వాడ్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న చైనాకు  ప్రస్తుత పరిస్థితి సంతోషం కలిగిస్తుందని పేర్కొన్నాయి.  ఇది  జిన్‌పింగ్‌కు బహుమానమని వ్యాఖ్యానించాయి. 

అసలేం జరిగిందంటే..?

అమెరికాను డెట్‌ సీలింగ్‌ (రుణ గరిష్ఠపరిమితి) సమస్య వెంటాడుతోంది. డెట్‌ సీలింగ్‌కు చట్టసభ ఆమోదం లభించకపోతే అగ్రరాజ్యం దివాలా తీసే ప్రమాదముంది. దీంతో ఈ అంశంపై జో బైడెన్‌ ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ వారాంతంలో మొదలయ్యే తన ఆసియా పర్యటనను బైడెన్‌ కుదించుకున్నారు. జపాన్‌లో జరిగే జీ-7 సదస్సుకు హాజరుకానున్న బైడెన్‌.. ఆ తర్వాత వెళ్లాల్సిన ఆస్ట్రేలియా, పపువా న్యూ గినియా పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆసీస్‌ ప్రధాని అల్బనీస్‌కు.. అమెరికా అధ్యక్షుడు ఫోన్‌లో సమాచారమిచ్చారు.

దీనికి ముందు మంగళవారం బైడెన్ పర్యటన గురించి మాట్లాడుతూ.. వచ్చేవారం పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశంలో  అమెరికా అధ్యక్షుడు ప్రసంగిస్తారని అల్బనీస్‌ సగర్వంగా ప్రకటించారు. అలా చెప్పారో లేదో కొన్నిగంటల వ్యవధిలోనే తాను రావట్లేదని బైడెన్‌ సమాచారం ఇచ్చారు. ఇదే ఇబ్బందికర పరిస్థితి అనుకుంటే.. ఈ అధికారిక ప్రకటన కంటే ముందే అంతర్జాతీయ మీడియా సంస్థల్లో పర్యటన రద్దు గురించి వార్తలు వచ్చాయి. పరిస్థితులు అనుకూలించక ఆస్ట్రేలియా రానని చెప్పిన బైడెన్‌.. జీ-7(G7 summit) కోసం మాత్రం జపాన్‌(Japan)వెళ్లారు. 

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే క్వాడ్ కూటమి ఏర్పాటును చైనా మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఆ కూటమిని ఆసియన్ నాటోగా వర్ణిస్తోంది. అందుకే క్వాడ్ విషయంలో ఏ మాత్రం గందరగోళం పరిస్థితులు నెలకొన్నా.. అది జిన్‌పింగ్‌ సంతోషాన్ని కలిగిస్తుందని మీడియా కథనాలు రాసుకొచ్చాయి. 

జపాన్‌లో ల్యాండ్‌ అయిన బైడెన్‌..

ఈ నెల 19-21 తేదీల్లో జపాన్‌లోని హిరోషిమా వేదికగా జీ-7 సదస్సు జరగనుంది. ఇందుకోసం బైడెన్‌ ఇప్పటికే జపాన్ చేరుకున్నారు. జపాన్‌లో జరిగే జీ-7 సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. ఆ సదస్సులో భాగంగా మోదీ, బైడెన్‌ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని