Updated : 24 May 2022 13:20 IST

china: డ్రాగన్‌పై బైడెన్‌ గందరగోళాస్త్రం..!

 అధ్యక్షుడు అవునంటే.. వైట్‌హౌస్‌ కాదంటుంది.. ఇదేంటంటున్న చైనా..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

తైవాన్‌.. అమెరికాకు సెమీకండెక్టర్లను సరఫరా చేసే కీలక దేశం. అటువంటి దేశం విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ (biden) ఓ మాట మాట్లాడితే.. ఆయన అధికారిక నివాసం శ్వేతసౌధం పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. తైవాన్‌ను ఆక్రమించేందుకు ఎదురు చూస్తోన్న చైనాకు ఏది నమ్మాలో అర్థం కావడం లేదు..! ఇలా ఒకసారి జరిగిందంటే ఏదో సమన్వయ లోపం అనుకోవచ్చు. కానీ, ఇప్పటికి మూడు సార్లు ఇదే విధంగా జరిగింది. అయితే.. ఇది సాధారణంగా జరిగింది కాదు. తైవాన్‌ ఆక్రమణ జరిగితే అమెరికా స్పందనపై చైనా(china) ఎటువంటి అంచనాకు రానీయకుండా గందరగోళ పర్చేందుకు అనుసరిస్తోన్న వ్యూహంగా భావిస్తున్నారు. తైవాన్‌ ఆక్రమణకు చైనా అధికారులు వ్యూహారచన చేస్తున్న ఆడియో లీక్‌ అయినా సమయంలోనే వెలువడిన బైడెన్‌ (biden) వ్యాఖ్యలు మరోసారి గందరగోళానికి దారితీశాయి.

చైనా(china) యుద్ధ ప్రణాళిక ఆడియో లీక్‌..

తైవాన్‌ ఆక్రమణకు చైనా(china) అంతర్గత యత్నాలను తీవ్రతరం చేసింది. తాజాగా పీఎల్‌ఏ సైనికాధికారులు తైవాన్‌ ఆక్రమణ ప్రణాళికపై చర్చిస్తోన్న ఓ ఆడియోను  చైనా మానవహక్కుల కార్యకర్త జెన్నిఫర్‌ ఝాంగ్‌ ట్విటర్‌లో విడుదల చేశారు. దీనిలో చైనా టాప్‌ మిలటరీ అధికారులు తైవాన్‌పై దాడి కోసం దళాల సమీకరణతో యుద్ధ పరిస్థితి మార్పులు వంటి అంశాలపై చర్చించారు.

ఆక్రమిస్తే ఏమి జరుగుతుందో చెప్పను..?

ప్రపంచానికి ఇష్టమున్నా లేకపోయినా అమెరికా అత్యంత శక్తిమంతమైన దేశం. ఈ నేపథ్యంలో తైవాన్‌పై దాడి చేస్తే అమెరికా ఎలా స్పందిస్తుందనేది చైనాకు అత్యంత కీలకమైన అంశం. ఈ విషయం వాషింగ్టన్‌కు స్పష్టంగా తెలుసు. ఈ నేపథ్యంలో తన సైనిక ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది ఎప్పటికీ బహిర్గతంగా వెల్లడించలేదు. దీనిని ‘స్ట్రాటిజిక్‌ యాంబిగ్యుటీ’ (వ్యూహాత్మక అస్పష్టత)గా వ్యవహరిస్తారు. కొన్నేళ్లుగా దీన్ని కొనసాగిస్తోంది. అదే సమయంలో తైవాన్‌ స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించేలా హామీలు ఇచ్చి రెచ్చగొట్టదు.

అమెరికా పాటించే ‘వన్‌ చైనా పాలసీ’లో కూడా ప్రపంచంలో చట్టపరమైన పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా (china) ఒక్కటే ఉందని గుర్తిస్తుంది. అదే సమయంలో తైవాన్‌ దానిలో భాగమని అంగీకరిస్తుంది గానీ.. ఆమోదించదు.  2021 నవంబర్‌లో ఈ విషయాన్ని బైడెన్‌ (biden) పునరుద్ఘాటించారు. ఆసియాలో కొత్తగా ఎటువంటి యుద్ధం మొదలవ్వకుండా చూడటం దీని లక్ష్యం. దీంతో వాషింగ్టన్‌ అత్యంత కఠినమైన సమతౌల్యాన్ని పాటించాల్సి వస్తోంది.

తరచూ బైడెన్‌ (biden) ఏం చెబుతున్నారు..?

తాజాగా టోక్యో పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ను విలేకర్లు తైవాన్‌ విషయాన్ని ప్రశ్నించారు. ఉక్రెయిన్‌ విషయంలో సైన్యాన్ని పంపేందుకు అమెరికా నిరాకరించింది కదా.. తైవాన్‌ను చైనా (china) ఆక్రమిస్తే మీ సైన్యం  రంగంలోకి దిగుతుందా..? అని ప్రశ్నించగా.. ‘ఔను’ అని బైడెన్‌ నుంచి సమాధానం వచ్చింది. దీనిని మరింత ఎగదోస్తూ..‘మేము వాగ్దానం చేశాం’ అని బైడెన్‌ బాంబు పేల్చారు. వాస్తవానికి తైవాన్‌ను రక్షించేందుకు అమెరికా నుంచి ఎటువంటి అధికారిక వాగ్దానం లేదు. కానీ, బైడెన్‌ ఇలా చెప్పడం ఇదే తొలిసారి కాదు. కానీ, ఒక్క రోజు తర్వాత మంగళవారం మళ్లీ బైడెన్‌ (biden) ఈ అంశంపై స్పందిస్తూ.. తైవాన్‌ విషయంలో అమెరికా వైఖరిలో మార్పులేదన్నారు. ‘స్ట్రాటిజిక్‌ యూంబిగ్యుటీ’ కొనసాగుతుందని వెల్లడించారు.

ఎందుకలా..?

జోబైడెన్‌ దాదాపు నాలుగు దశాబ్దాలుగా అమెరికా విదేశాంగ విధానం రూపకల్పనలో భాగస్వామిగా పనిచేశారు. ఆయన గందరోగళంతో చెప్పడం లేదు. 1979 తైవాన్‌ రిలేషన్స్‌ చట్టం కింద ఆ ద్వీపం తనను తాను రక్షించుకొనేందుకు అవసరమైన సాయం అందించడంపై మాట్లాడుతున్నారని అమెరికా విదేశాంగ విధానాల నిపుణులు వెల్లడిస్తున్నారు.

తరచూ ఇలా బైడెన్‌ చెప్పడం.. ఆ తర్వాత శ్వేతసౌధం పూర్తి వ్యతిరేకంగా వివరణ ఇవ్వడం అమెరికాలో రాజకీయ చిచ్చుకు కారణం కావచ్చనే భయాలు ఉన్నాయి. వృద్ధాప్యం కారణంగా బైడెన్‌ మానసిక పరిస్థితి స్థిరంగా లేదని ప్రత్యర్థి రిపబ్లికన్లు ప్రచారం చేసే అవకాశం ఉంది. అంతేకాదు..  తైవాన్‌పై చైనా దాడి చేస్తే నిర్ణయాలను శ్వేతసౌధ సహాయకులు తీసుకోరని.. బైడెన్‌ తీసుకోవాల్సి ఉంటుందని విమర్శించే అవకాశం ఉంది. అదే సమయంలో చైనా బైడెన్‌ (biden)మాటలు నమ్మాలా..? ఆయన సహాయకుల మాటలు నమ్మాలా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో బైడెన్‌ చెప్పింది నమ్మాలా వద్ద అన్నదానికంటే.. చైనా(china) ఏం  ఆలోచిస్తోంది అన్నదే కీలకం. అమెరికా ‘వ్యూహాత్మక అస్పష్టత’ అన్నదాని కంటే ‘వ్యూహాత్మక గందరగోళం’ అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది.

పరిస్థితిని మార్చేసిన ఉక్రెయిన్‌ యుద్ధం..

ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో తొలుత దూరంగా ఉన్నట్లు వ్యవహరించిన అమెరికా.. ఆ తర్వాత ఏకంగా 40 బిలియన్‌ డాలర్లు ఇచ్చి పరోక్షగా క్రెమ్లిన్‌పై యుద్ధం మొదలుపెట్టింది. దీంతో సాధారణంగా ఊహించిన దానికంటే బైడెన్‌ (biden) దూకుడుగా ఉన్నారనే సందేశం ప్రపంచానికి వెళ్లింది. ఇదే అంశాన్ని చైనా  తైవాన్‌కు వర్తింపజేసుకొని చూసుకుంటోంది. దీనికి తోడు  క్వాడ్‌ మీటింగ్‌ కోసం బైడెన్‌ ఆసియాకు వచ్చిన సమయంలో చేసిన వ్యాఖ్యలు కావడం చైనాను మరింత ఆందోళనకు గురిచేసింది. 

మరోపక్క షీజిన్‌పింగ్‌ మూడో సారి అధికారం నిలబెట్టుకొనేందుకు యత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కొవిడ్‌ కట్టడి వైఫల్యాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తైవాన్‌కు అమెరికా మద్దుతు కూడా తోడైతే.. జిన్‌పింగ్‌పై ఒత్తిడి పెరగవచ్చు.

చైనా (china) స్పందన ఎలా ఉండొచ్చు..

తమ అంతర్గత విషయంలో బైడెన్‌ (biden) చొరబడుతున్నట్లు చైనా (china) భావించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తన శక్తి ప్రదర్శనకు డ్రాగన్‌ దిగొచ్చు. దీనిలో భాగంగా తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి భారీ సంఖ్యలో యుద్ధవిమానాలను పంపి.. అమెరికాకు హెచ్చరిక సంకేతాలు పంపవచ్చు. తాజాగా బైడెన్‌  వ్యాఖ్యలపై చైనాకు చెందిన తైవాన్‌ వ్యవహారాల శాఖ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘నిప్పుతో చెలగాటమాడితే కాలక తప్పదు’’ అని హెచ్చరించారు.


Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts