Kuwait fire tragedy: మెట్లపైనే కాలిపోయిన మృతదేహాలు.. కువైట్‌ అగ్నిప్రమాదంలో భయానక దృశ్యాలు

కువైట్ అగ్నిప్రమాద ఘటన (Kuwait fire tragedy)లో పలు విషాదకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదంలో చిక్కుకుపోయిన పలువురు కార్మికులు బయటకు వచ్చే క్రమంలో మెట్లపైనే ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా వెల్లడించింది. 

Updated : 13 Jun 2024 12:56 IST

దిల్లీ: కువైట్‌ (Kuwait)లోని మంగాఫ్‌లో ఉన్న భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటన (Kuwait fire tragedy) మృతుల్లో 42మంది భారతీయులు ఉన్నారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. దాంతో వాటి గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారని కేంద్రమంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్ వెల్లడించారు. ‘‘మృతులను గుర్తించిన వెంటనే.. వారి బంధువులకు సమాచారం అందిస్తాం. మన వాయుసేన విమానం ఆ మృతదేహాలను స్వదేశానికి తీసుకువస్తుంది’’ అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెట్లపై కాలిపోయిన మృతదేహాలు కనిపించాయని స్థానిక మీడియా వెల్లడించింది. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీలో నుంచి దూకి గాయపడ్డారని పేర్కొంది. తలుపుకు తాళం వేసి ఉండటంతో వారు భవనం పైభాగానికి వెళ్లలేకపోయినట్లు పేర్కొంది.

ఈ ఘటనపై విదేశాంగమంత్రి ఎస్‌ జై శంకర్‌.. కువైట్ ప్రభుత్వంతో మాట్లాడారు. అగ్నిప్రమాద మృతులను సాధ్యమైనంత త్వరగా వెనక్కి పంపేలా చూడాలని కోరారు. అలాగే గాయపడినవారికి వైద్యసహాయం అందుతోందని చెప్పారు. మంగాఫ్‌లో ఉన్న అల్‌-మంగాఫ్‌ అనే ఆరు అంతస్తుల భవనాన్ని ఎన్‌బీటీసీ అనే కంపెనీ అద్దెకు తీసుకుంది. అందులో 195 మంది కార్మికులు నివసిస్తున్నారు. వారు నిద్రిస్తున్న సమయంలో వంట గదిలో చెలరేగిన మంటలు క్షణాల్లో భవనం మొత్తం వ్యాపించడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 49 మంది ప్రాణాలు విడిచారు. ఈ ఘటన నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తోన్న భారతీయుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్‌ కోరింది. పని ప్రదేశాల్లో మెరుగైన వసతులు కల్పించేలా బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేసింది.

కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 49 మంది దుర్మరణం

ఈ ప్రమాదంపై కువైట్ మంత్రి మాట్లాడుతూ.. కంపెనీ, భవన యజమానుల అత్యాశవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. ఆ భవనాన్ని ఎన్‌బీటీసీ సంస్థ అద్దెకు తీసుకుంది. వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండానే అక్కడ కార్మికులను ఉంచింది. ఫలితంగా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 21 మంది కేరళ, ఐదుగురు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని