Boeing: 737 మ్యాక్స్‌ విమాన ప్రమాదాలు.. బోయింగ్‌ నేరాంగీకారం

Boeing: రెండు ఘోర ప్రమాదాలకు సంబంధించి బోయింగ్‌ సంస్థ నేరాన్ని అంగీకరించింది. ఈమేరకు అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం కుదుర్చుకుంది.

Updated : 08 Jul 2024 14:18 IST

Boeing | వాషింగ్టన్‌: ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ (Boeing).. అమెరికా న్యాయ విభాగంతో (జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌) ఒప్పందం కుదుర్చుకుంది. 737 మ్యాక్స్‌ విమానాలు రెండు ఘోర ప్రమాదాలకు గురైన కేసులో నేరపూరిత మోసానికి పాల్పడినట్లు అంగీకరించింది. ఆయా విమానాల సర్టిఫికేషన్స్‌ విషయంలో అమెరికా నియంత్రణ సంస్థలను మోసం చేసినట్లు ఒప్పుకొంది. బోయింగ్‌ సైతం ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించింది. దీనికి ఫెడరల్‌ జడ్జి ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

2018, 2019 సంవత్సరాల్లో ఐదు నెలల వ్యవధిలో ఇండోనేసియా, ఇథియోపియాలో రెండు 737 మ్యాక్స్‌ విమానాలు ఘోర ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఘటనల్లో సుమారు 346 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై బోయింగ్‌పై ప్రాసిక్యూషన్‌కు బాధిత కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో బోయింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిప్రకారం.. 243.6 మిలియన్‌ డాలర్లు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు విమానాల్లో భద్రత మెరుగుకు బోయింగ్‌ 455 మిలియన్‌ డాలర్లను వెచ్చించాల్సి ఉంటుంది. 

రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?

ఈ ఒప్పందం కేవలం ఆ రెండు ఘటనల నుంచి మాత్రమే బోయింగ్‌కు రక్షణ కల్పిస్తుంది. ఈ ఏడాది అలస్కాలో చోటుచేసుకున్న ప్రమాదాల నుంచి గానీ, ప్రస్తుత, మాజీ బోయింగ్‌ ఉద్యోగులకు గానీ ఎలాంటి రక్షణ ఉండదని జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ స్పష్టంచేసింది. న్యాయ విభాగంతో బోయింగ్‌ ఒప్పందం కుదుర్చుకోవడంపై విమాన ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తుల కుటుంబసభ్యులు పెదవి విరుస్తున్నారు. భద్రతను గాలికొదిలేసి లాభాల కోసం బోయింగ్‌ ఎలాంటి వ్యాపార పద్ధతులను అవలంబించిందీ నిరూపించేందుకు పలు సాక్ష్యాధారాలను గత ఐదేళ్లలో తాము అందించామని, ఈ ఒప్పందం కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా ఉందని వారి తరఫు లాయర్‌ పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని తిరస్కరించాలని తాము జడ్జిని కోరనున్నట్లు తెలిపారు. 

ఆరోపణ ఇదీ..

విమానయాన చరిత్రలో ఘోర ప్రమాదాలుగా నిలిచిన ఈ రెండు ప్రమాదాల్లో ఫ్లైట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌లో లోపాలే కారణమని తేలింది. అయితే, ఆయా వ్యవస్థలు సక్రమంగానే పనిచేస్తున్నాయని నిరూపించేందుకు నియంత్రణ సంస్థలను బోయింగ్‌ మోసగించిందన్నది ప్రాసిక్యూటర్ల ఆరోపణ. ఈ క్రమంలోనే విచారణ నుంచి తప్పించుకునేందుకు 2021 జనవరిలోనే న్యాయ విభాగంతో బోయింగ్‌ ఓ ఒప్పందం కుదర్చుకుంది. మూడేళ్ల నాటి ఈ ఒప్పందంలోని అంశాలను సైతం బోయింగ్‌ ఉల్లంఘించిందని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా మరోసారి న్యాయ విభాగంతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని