Jimmy Jimmy: కోల్డ్‌వార్ వేళ.. రష్యాను ఓ ఊపుఊపిన బాలీవుడ్ సాంగ్!

రష్యా పర్యటనలో భాగంగా ప్రవాసులతో భేటీ అయిన ప్రధాని మోదీ.. భారతీయ సినిమాల గురించి మాట్లాడారు. ఇక్కడి వారికి బాలీవుడ్‌ సినిమాలు కొత్తేం కాదన్నారు.

Published : 10 Jul 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత సంగీతం, సినిమాలు విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ (Narendra Modi) ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. అలనాటి ప్రముఖ నటులు రాజ్‌కపూర్‌, మిథున్ చక్రవర్తి సినిమాలకు సోవియట్‌ రష్యాలో విశేష ఆదరణ లభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికీ అక్కడి పౌరులు బాలీవుడ్ పాటలను హమ్‌ చేస్తుంటారు.

మిథున్‌ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన డిస్కో డ్యాన్సర్ భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా 1984లో రష్యాలో విడుదలైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో పాశ్చాత్యసినిమాలు రాకుండా మాస్కో నిషేధం విధించింది. దీంతో బాలీవుడ్‌ చిత్రాలకు ఆదరణ పెరిగింది. డిస్కోడ్యాన్సర్‌ చిత్రాన్ని చూసేందుకు జనాలు బారులు తీరారు. "Jimmy Jimmy Aaja Aaja" అనే పాట ఒక గీతంలా మారిపోయింది. అప్పట్లో ఎవరి ఇంట్లో చూసినా, ఎవరి నోటినైనా ఇదే పాట వినిపించేది.

‘చిన్నారుల మరణాలతో గుండె తరుక్కుపోతోంది’ - పుతిన్‌తో మోదీ

ఆ సినిమా విడుదలైన రెండేళ్లకు అప్పటి యూఎస్‌ఎస్‌ఆర్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్‌ భారత్‌లో పర్యటించారు. నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ.. అమితాబ్ బచ్చన్‌ను చూపించి, ఈయన భారత సూపర్ స్టార్ అని పరిచయం చేశారు. అయితే ఆ సందర్భంలో గోర్బచెవ్ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. ‘‘నా కుమార్తెకు మిథున్ చక్రవర్తి మాత్రమే తెలుసు’’ అని బదులిచ్చారు. ఆ సినిమా వచ్చి ఇప్పటికి 40 ఏళ్లు అవుతున్నా.. ఇంకా కొందరి నోళ్లలో ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో ఎవరైనా భారత్ అని చెప్తే చాలు.. వారు ‘జిమ్మీజిమ్మీ ఆజా ఆజా’ లేకపోతే ‘అయామ్‌ ఏ డిస్కో డ్యాన్సర్’ అని రిప్లై ఇచ్చేవారట. డిస్కో డ్యాన్సరే కాకుండా మరికొన్ని బాలీవుడ్ చిత్రాలు వారిని ఎంతో ఆకట్టుకున్నాయి. దీనిని ఉద్దేశించే తాజాగా మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాల బంధంలో సినిమాలది కీలక పాత్ర అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని