అధ్యక్షుడి చుట్టూ సూపర్‌ మ్యాన్‌ చక్కర్లు..!

ఒక దేశ అధ్యక్షుడికి ఏ స్థాయి భద్రత ఉంటుందో తెలిసిందే. ఆ స్థాయి వ్యక్తి వద్దకు ఎవరు రావాలన్నా ఎన్నో తనిఖీలను దాటాలి.

Published : 08 Sep 2022 01:18 IST

శాంటియాగో: ఒక దేశ అధ్యక్షుడికి ఏ స్థాయి భద్రత ఉంటుందో తెలిసిందే. ఆ స్థాయి వ్యక్తి వద్దకు ఎవరు రావాలన్నా ఎన్నో తనిఖీలను దాటాలి. అలాంటిది చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్‌ సీరియస్‌గా ప్రసంగిస్తోన్న వేళ.. ఓ చిన్నారి సూపర్‌ మ్యాన్‌ ఆయన చుట్టూ సైకిల్‌పై చక్కర్లు కొట్టాడు. ఇంతకీ విషయం ఏంటంటే..?

కొత్త రాజ్యాంగానికి మద్దతు ఇవ్వాలంటూ చిలీ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. దానిపై తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం గాబ్రియేల్‌ మాట్లాడుతూ.. ప్రజలంతా సవరణలకు అనుకూలంగా ఓటు వేయాలని కోరారు. ఆ క్రమంలో ఆయన మాట్లాడుతుండగా.. ఆయన చుట్టూ సూపర్ మ్యాన్‌ తరహా దుస్తులు ధరించిన ఓ చిన్నారి సైకిల్‌పై చక్కర్లు కొడుతూ కనిపించాడు. స్వయానా అధ్యక్షుడు, ఎంతోమంది సిబ్బంది అక్కడే ఉన్నా ఎలాంటి జంకూ లేకుండా ఆయన చుట్టూ తిరిగాడు. గతవారం రికార్డ్‌ అయిన ఈ వీడియో తాజాగా వైరల్‌ అవుతోంది. పలువురు నెటిజన్లు దీనిపై కామెంట్ల వర్షం కురిపించారు. అయితే.. ఆ చిన్నారి ఎవరో..? అక్కడ తిరగడానికి గల కారణమేంటో తెలియరాలేదు.

ఇదిలా ఉంటే.. ప్రజాభిప్రాయ ఓటింగ్‌లో గాబ్రియేల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కొత్త రాజ్యాంగానికి అనుకూలంగా 4.9 మిలియన్ల మంది ఓటు వేయగా.. 7.9 మిలియన్ల మంది చిలీ వాసులు వ్యతిరేకించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని