Boris Johnson: ‘పార్టీ గేట్‌’ కుంభకోణం.. బ్రిటన్‌ ప్రధాని, ఆర్థిక మంత్రికి జరిమానా!

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఆర్థిక మంత్రి రిషి సునక్‌కు షాక్‌! కొవిడ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి విందుల్లో పాల్గొన్నందుకుగానూ ఈ ఇద్దరికీ జరిమానా పడనున్నట్లు డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి మంగళవారం తెలిపారు. ప్రధాని భార్య క్యారీ...

Published : 12 Apr 2022 21:57 IST

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఆర్థిక మంత్రి రిషి సునక్‌కు షాక్‌! కొవిడ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి విందుల్లో పాల్గొన్నందుకుగాను వీరిద్దరికీ జరిమానా పడనున్నట్లు డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి మంగళవారం తెలిపారు. ప్రధాని భార్య క్యారీ జాన్సన్‌కు కూడా పెనాల్టీ నోటీసు జారీ చేయనున్నట్లు చెప్పారు. 2020-21 కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంక్షలను ఇష్టానుసారం ఉల్లంఘించారంటూ ‘పార్టీ గేట్‌’ కుంభకోణం పేరిట ఒక్కొక్క విషయం బయటపడిన విషయం తెలిసిందే. కొవిడ్‌ ఆంక్షలు కఠినంగా అమలులో ఉన్న 2020 మే 20న గార్డెన్‌ పార్టీ, జూన్‌ 19న బోరిస్‌ జన్మదిన వేడుకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారాలపై నిజానిజాలు తేల్చేందుకు లండన్‌ మెట్రోపాలిటన్‌ పోలీసులు రంగంలోకి దిగారు.

తాజాగా డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ముగ్గురూ.. మెట్రోపాలిటన్ పోలీసులు జరిమానా విధిస్తున్నట్లుగా పేర్కొన్న నోటిఫికేషన్‌ను అందుకున్నారని చెప్పారు. అయితే, ఎంత మొత్తంలో జరిమానా విధించారనేది తెలియాల్సి ఉంది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు జరిమానా పడిన బ్రిటన్‌ మొదటి ప్రధాన మంత్రి జాన్సనే కావడం గమనార్హం! ఈ నేపథ్యంలో బోరిస్‌, సునక్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని బ్రిటన్‌ ప్రతిపక్ష నేత స్టార్‌మర్‌ డిమాండ్‌ చేశారు. గతంలోనూ బోరిస్‌.. ప్రధాని పదవి వీడాలంటూ ప్రతిపక్ష ఎంపీలు పదేపదే డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, తన మీద ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా రాజీనామా చేయను గాక.. చేయనంటూ జాన్సన్‌ గతంలోనే స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని