Brazil: గవర్నర్ తొలగింపు.. 1200 మంది అదుపులోకి.. అల్లర్లపై బ్రెజిల్ కఠిన చర్యలు!
బ్రెజిల్ రాజధాని బ్రజిలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 1200 మంది ఆందోళనకారులను స్థానిక భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
బ్రజిలియా: బ్రెజిల్(Brazil) మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో(Jair Bolsonaro) మద్దతుదారుల ఆందోళనలతో సోమవారం రాజధాని బ్రజిలియా(Brasilia)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. వారంతా ఏకంగా సుప్రీంకోర్టు, కాంగ్రెస్, అధ్యక్ష భవనాల్లోకి దూసుకెళ్లి.. విధ్వంసం సృష్టించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు(Supreme Court).. రాజధానిలో భద్రతా వైఫల్యాలకు బాధ్యుడిని చేస్తూ బ్రజిలియా గవర్నర్‌పై వేటు వేసింది. 90 రోజులపాటు ఆయన్ను పదవి నుంచి తొలగించింది.
ఇలాంటి మరిన్ని దేశవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేందుకుగానూ తాజా ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని బ్లాక్ చేయాలని ఫేస్‌బుక్, ట్విటర్, టిక్‌టాక్‌లను ఆదేశించింది. దీంతోపాటు రాజధానిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం వెలుపల, ఇతర ప్రదేశాల్లోని ఆందోళనకారుల శిబిరాలను తొలగించాలని చెప్పింది. దీంతో అధికారులు ఈ మేరకు రంగంలోకి దిగారు. మరోవైపు, ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు 1200మందికి పైగా ఆందోళనకారులను భద్రతాబలగాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అల్లర్లకు బాధ్యులైన వారిని న్యాయస్థానంలో నిలబెడతామని నూతన దేశాధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా స్పష్టం చేశారు. బోల్సొనారోనే అల్లరి మూకలను రెచ్చగొట్టారని ఆరోపించారు. అయితే.. బోల్సొనారో ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లూలాకు 50.9 శాతం ఓట్లు లభించగా.. బోల్సొనారోకు 49.1 శాతం వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలను అంగీకరించేందుకు బోల్సొనారో నిరాకరిస్తున్నారు. దేశంలోని కోర్టులు, ఎన్నికల వ్యవస్థలు తనకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం వేలసంఖ్యలో ఆయన మద్దతుదారులు భద్రతా వలయాలను ఛేదించుకొని దేశ రాజధానిలోని కీలక భవనాల్లోకి చొరబడ్డారు. సైన్యం జోక్యం చేసుకొని బోల్సొనారోకు అధికారం అప్పజెప్పడం, లేదా ప్రస్తుత అధ్యక్షుడు లూలాను అధికార పీఠం నుంచి దింపేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ తదితర ప్రపంచదేశాల నేతలు ఈ అల్లర్లను ఖండించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Hyderabad: రెండు స్థిరాస్తి సంస్థలకు భారీగా జరిమానా విధించిన రెరా
-
Gunniness Record: ఒక్కరోజే 3,797 ఈసీజీలు.. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో చోటు