Jair Bolsonaro: బ్రెజిల్‌లో అల్లర్ల వేళ.. ఆసుపత్రిలో బోల్సొనారో

బ్రెజిల్‌లో మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో మద్దతుదారులు తీవ్ర అల్లర్లకు పాల్పడిన వేళ.. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం చర్చనీయాశంగా మారింది. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను బోల్సొనారో తాజాగా ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Published : 10 Jan 2023 12:38 IST

ఒర్లాండో: బ్రెజిల్‌ (Brazil) మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో (Jair Bolsonaro) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అమెరికా (USA)లోని ఫ్లోరిడాలో ఓ ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. బ్రెజిల్‌లో బోల్సొనారో మద్దతుదారులు అరాచకం సృష్టించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కడుపునొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సతీమణి మిషెల్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని కుటుంబ వర్గాలు వెల్లడించాయి.

2018 ఎన్నికల సమయంలో బోల్సొనారో (Jair Bolsonaro) కత్తిపోట్లకు గురయ్యారు. ఆ దాడిలో ఆయన మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత ఆయనకు కొన్ని శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ దాడి కారణంగా ఇప్పటికీ ఆయన కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఆదివారం కూడా కడుపులో నొప్పి రావడంతో ఒర్లాండోలోని ఆసుపత్రిలో చేరానని బోల్సొనారో తెలిపారు. తన క్షేమం కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు.

కాగా.. బ్రెజిల్‌ (Brazil) రాజధాని బ్రసీలియాలో బోల్సొనారో (Jair Bolsonaro) మద్దతుదారులు ఆదివారం హింసాత్మక అల్లర్లకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో ఓటమిని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు.. దేశ అధికార కేంద్రాలైన నేషనల్‌ కాంగ్రెస్‌, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవనాలను ముట్టడించారు. భద్రతా వలయాలను ఛేదించుకుని కీలక భవనాల్లోకి చొరబడి అక్కడ సామగ్రిని ధ్వంసం చేశారు. భద్రతా దళాలు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ అల్లర్లను బ్రెజిల్‌ ప్రభుత్వం సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోల్సొనారో (Jair Bolsonaro)కు 49.1శాతం ఓట్లు రాగా.. 50.9శాతం ఓట్లతో లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా విజయం సాధించి వారం క్రితమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఫలితాలను తీవ్రంగా వ్యతిరేకించిన బోల్సొనారో.. తన పదవీకాలం ముగియడానికి రెండు రోజుల ముందే డిసెంబరు 31న అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఫ్లోరిడాలో ఉంటున్నారు. అయితే తాజా అల్లర్ల నేపథ్యంలో బోల్సొనారో (Jair Bolsonaro)ను ఫ్లోరిడా నుంచి పంపించాలని జో బైడెన్‌ (Joe Biden) సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. అటు బైడెన్‌ కూడా బ్రెజిల్‌ అల్లర్లను ఖండించారు. ఈ క్రమంలోనే బోల్సొనారో ఆసుపత్రిలో చేరడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని