Boris Johnson: మరో వివాదంలో బోరిస్‌ జాన్సన్‌.. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘించి బర్త్‌ డే పార్టీ!

కొవిడ్‌ విజృంభిస్తున్న వేళ 2020 మేలో బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌.. తన అధికారిక నివాసం ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’లో సిబ్బందితో కలిసి విందులు చేసుకున్నారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌ 17న కూడా ఆయన కార్యాలయ సిబ్బంది విందు...

Published : 26 Jan 2022 01:53 IST

లండన్‌: కొవిడ్‌ విజృంభిస్తున్న వేళ 2020 మేలో బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌.. తన అధికారిక నివాసం ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’లో సిబ్బందితో కలిసి విందులు చేసుకున్నారంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌ 17న కూడా ఆయన కార్యాలయ సిబ్బంది విందు, వినోదాల్లో మునిగిపోయారని ఇటీవల ‘డైలీ టెలిగ్రాఫ్‌’ ఓ కథనం వెలువరించింది. తాజాగా.. 2020 జూన్ 19న తన పుట్టిన రోజు సందర్భంగానూ బోరిస్‌ జాన్సన్‌ ఆంక్షలు ఉల్లంఘించి ఓ పార్టీ నిర్వహించినట్లు ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. దీంతో ఈ వ్యవహారాలపై నిజానిజాలు తేల్చేందుకు లండన్‌ పోలీసులు రంగంలోకి దిగారు. గత రెండేళ్లలో డౌనింగ్ స్ట్రీట్, వైట్‌హాల్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి నిర్వహించిన కార్యక్రమాలపై దర్యాప్తు చేస్తున్నట్లు లండన్‌ మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ క్రెసిడా డిక్ మంగళవారం వెల్లడించారు.

డౌనింగ్‌ స్ట్రీట్‌లో నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు మొదట్లో దర్యాప్తు చేయలేదనే విమర్శలను క్రెసిడా ఈ సందర్భంగా కొట్టిపారేశారు. ‘వీటిపై నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా దర్యాప్తు చేస్తున్నాం. అంటే దీని అర్థం.. సదరు కార్యక్రమాల్లో పాల్గొన్నవారందరికీ జరిమానా నోటీసులు జారీ అవుతాయని కాదు’ అని క్రెసిడా.. అసెంబ్లీ పోలీస్‌, క్రైం కమిటీకి తెలిపారు. మరోవైపు సీనియర్ అధికారి స్యూ గ్రే కూడా పోలీసుల సహకారంతో ప్రత్యేక విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఏప్రిల్‌ 17నాటి విందులో ప్రధాని పాల్గొన్నట్లు స్పష్టంగా తెలియరాకున్నా.. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ అంత్యక్రియలకు ముందు రోజు ఇది జరగడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. విపక్షాలతోపాటు అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నుంచీ ప్రధానిపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదం తెరపైకి రావడం.. ఆయన్ను మరిన్ని చిక్కుల్లో పడేసినట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని