Updated : 20 Jan 2022 15:32 IST

Britain: బ్రిటన్‌లో ఇక మాస్క్‌ తప్పనిసరి కాదు.. ఆంక్షల ఎత్తివేత దిశగా..

ఇంటర్నెట్‌డెస్క్‌‌: కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఉద్ధృతితో విలవిల్లాడిన ఐరోపా దేశం బ్రిటన్‌.. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. గత కొన్ని రోజులుగా అక్కడ కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఒమిక్రాన్‌ కట్టడి కోసం అమలు చేస్తున్న అదనపు ఆంక్షలను సడలించాలని బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే గురువారం నుంచి ఈ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తాజాగా ప్రకటించారు. వచ్చే వారం నుంచి ప్రజలు మాస్క్‌ ధరించడం తప్పనిసరి కాదని తెలిపారు. దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉచ్ఛదశను అధిగమించినట్లు గణాంకాలు చెబుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాన్సన్‌ వెల్లడించారు. 
బ్రిటన్‌లో వైరస్‌ పరిస్థితులపై బోరిస్‌ జాన్సన్‌ నిన్న పార్లమెంట్‌ దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఒమిక్రాన్‌ ఉచ్ఛదశను అధిగమించిందని ఆఫీస్‌ ఆఫ్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ (ONS) తాజా గణాంకాలు చెబుతున్నాయి. అంటే మనం ఆంక్షలను సడలించి తక్కువ నిబంధనలను అమలు చేసుకోవచ్చు. వచ్చే గురువారం నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోంలు, మాస్క్‌లు ధరించడం, పెద్ద పెద్ద సభలు, సమావేశాలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రం వంటివి తప్పనిసరి కాదు. బ్రిటన్‌ ప్రజలపై మాకు నమ్మకం ఉంది. వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా రద్దీ ప్రదేశాల్లో ప్రజలు స్వచ్ఛందంగా మాస్క్‌లు ధరిస్తారని, భౌతిక దూరం పాటిస్తారని మేం విశ్వసిస్తున్నాం. అలాగని, మాస్క్‌ పెట్టుకోకపోతే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోబోం’’ అని వెల్లడించారు. అయితే పాజిటివ్‌ వచ్చిన వారికి స్వీయ నిర్బంధం వంటి నిబంధనలు మాత్రం అమల్లోకి ఉంటాయని తెలిపారు. గత కొన్ని రోజులుగా బ్రిటన్‌లో కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆసుపత్రుల్లో చేరికలు కూడా తగ్గుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

దక్షిణాఫ్రికాలో మొట్టమొదట వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌.. ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోన్న విషయం తెలిసిందే. యూకేపై ఒమిక్రాన్‌ తీవ్రంగా విరుచుకుపడింది. ఈ వేరియంట్ కారణంగా అక్కడ కేసులు విపరీతంగా పెరిగాయి. ఒక దశలో రోజువారీ కేసులు 2లక్షలకు పైనే నమోదయ్యాయి. దీంతో వైరస్‌ వ్యాప్తి కట్డడిలో భాగంగా గతేడాది డిసెంబరు 8న కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చారు. మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేయడంతో పాటు బూస్టర్ల పంపిణీని వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే కేసులు తగ్గుముఖం పట్టాయి. కొద్ది రోజులుగా రోజువారీ కేసులు లక్షకు దిగువనే నమోదవుతున్నాయి. దీంతో గత సోమవారం నుంచి ఐసోలేషన్‌ సమయాన్ని 7 రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించారు. 

మరో రెండు నెలల్లో ఐసోలేషన్‌ కూడా ఉండకపోవచ్చని జాన్సన్‌ అన్నారు. ‘‘కరోనా వైరస్‌ ఎండమిక్‌గా మారుతోంది. ఫ్లూ వంటి వ్యాధిలా తయారవుతోంది. అలాంటప్పుడు ప్రజలను బలవంతంగా ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం రాకపోవచ్చు. మార్చి 24 వరకు సెల్ఫ్‌ ఐసోలేషన్‌ నిబంధనల అమలు గడువు ముగుస్తుంది. ఆ తర్వాత వాటిని మళ్లీ పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని అనుకుంటున్నా’’ అని ఆయన చెప్పారు.

బ్రిటన్‌లో కొవిడ్ ఉద్ధృతి సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పై గత కొంతకాలంగా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని జాన్సన్‌ మరోసారి వాదించారు. అంతేగాక, తన ప్రభుత్వంలో వైరస్‌ కట్టడి కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నానని.. వ్యాక్సినేషన్‌, బూస్టర్ల పంపిణీని వేగవంతం చేశానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.  


Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని