Heathrow Airport: హీత్రూ విమానాశ్రయంలో మరోసారి సాంకేతిక లోపం.. భారీగా నిలిచిపోయిన సేవలు

ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన లండన్‌ హీత్రూ ఎయిర్‌పోర్టులో తీవ్ర సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వేలమంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వీరిలో మన బాలీవుడ్‌ స్టార్‌ కూడా ఉన్నారు.

Published : 26 Jun 2024 14:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం(Heathrow Airport)లో బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ ఐటీ విభాగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా భారీ సంఖ్యలో విమాన సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో వేల మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నట్లు డెయిలీమెయిల్‌ కథనంలో పేర్కొంది. లగేజీ కలెక్షన్‌లో కూడా తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. దీంతో వారి ప్రయాణాలు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలామంది ప్రయాణికులు తమ కనెక్టెడ్‌ ఫ్లైట్లను మిస్సయ్యారు. బ్యాగేజింగ్‌ హాల్స్‌లో దాదాపు 30 విమానాల ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు.

మరోవైపు ఈ ఘటనపై బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ స్పందించింది. తమ సంస్థ నిపుణులు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘మా కస్టమర్ల సేవల్లో ఏర్పడ్డ అంతరాయానికి క్షమాపణలు కోరుతున్నాం. వీలైనంత త్వరగా పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాం. ఈ అసౌకర్యానికి గురైన వారికి వీలైనంత సాయం చేసి.. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు మా బృందం కృషి చేస్తోంది’’ అని తెలిపారు.

ఎయిర్‌లైన్స్‌ అధికారిక కమ్యూనికేషన్స్‌తో ప్రయాణికులు టచ్‌లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ సమస్యకు కారణమైన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ దర్యాప్తును ఎదుర్కోవడంతోపాటు.. పరిహారాలు కూడా చెల్లించాల్సి రావచ్చు. వైమానిక రంగంలో బలమైన ఐటీ వ్యవస్థ ఉండాల్సిన విషయాన్ని ఈ ఘటన చెబుతోందని అధికారులు వెల్లడించారు.

విమానాశ్రయంలో చిక్కుకుపోయిన అదితిరావ్‌ హైదరీ..

బాలీవుడ్‌ నటి అదితిరావ్‌ హైదరీ కూడా ఈ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికుల్లో ఒకరు. ఆమె ఈ విషయాన్ని ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఈ ఎయిర్‌పోర్టులో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తాము రెండు గంటలుగా ఖాళీ లగేజీ బెల్ట్‌ వద్ద ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్‌ పోర్టు పరిస్థితిని ఫొటో తీసి దీనిలో పోస్టు చేశారు. ఈ విషయంపై ఆమె ఎయిర్‌ పోర్టు సిబ్బందిని ప్రశ్నించగా.. విమానయాన సంస్థతో మాట్లాడుకోవాలని వారు సూచించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని