British Airlines: ఇంత మోసమా.. ఎంతో ఆశతో విండో సీట్‌ బుక్‌ చేస్తే..!

డబ్బులు ఎక్కువగా చెల్లించి విండో సీట్‌ (Window Seat) బుక్‌ చేసుకున్న ఓ ప్రయాణికుడికి (Passenger) వింత అనుభవం ఎదురైంది. విమానం (Plane) ఎక్కిన తర్వాత అక్కడ విండో లేదు. మొత్తం మూసేసి ఉంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆయన.. ఆ ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో(Social media) పోస్టు చేశాడు.

Updated : 07 Feb 2023 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణంగా బస్సులు, రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు బయటకి చూస్తూ ఎంజాయ్‌ చెయ్యొచ్చనే ఉద్దేశంతో ఎక్కువ మంది విండో సీట్‌ (Window seat)నే కోరుకుంటారు. విమానాల్లో (Plane) అయితే విండో సీట్‌కు మరింత క్రేజ్‌. దాని కోసం ప్రత్యేక ఛార్జీలను కూడా వసూలు చేస్తుంటారు. అయితే, ఓ విమాన ప్రయాణికుడికి మాత్రం వింత అనుభవం ఎదురైంది. టికెట్‌ ధరకంటే ఎక్కువ చెల్లించి విండో సీట్‌ కొనుక్కున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. తీరా విమానం ఎక్కిన తర్వాత అక్కడ విండో లేదు. మొత్తం మూసేసి  ఉంది. దీంతో కంగుతిన్న ప్రయాణికుడు ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

అనిరుద్‌ మిత్తల్‌ అనే ప్రయాణికుడు లండన్‌ వెళ్లేందుకు బ్రిటిష్‌ ఎయిర్‌లైన్స్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. ల్యాండింగ్‌ సమయంలో వ్యూ బాగుంటుందనే ఉద్దేశంతో విమానం కుడివైపు విండో సీట్‌ను బుక్‌ చేసుకున్నాడు. తీరా, విమానం ఎక్కేసరికి అక్కడ మొత్తం మూసేసి ఉంది. ఆయన సీటుకు వెనుకవైపు, ముందువైపు రెండు సీట్లకూ విండో సదుపాయం ఉంది. దీంతో కంగుతిన్న ప్రయాణికుడు అక్కడున్న సిబ్బందిని అడిగాడు. అక్కడ విండో ఉండదని తెలిసి కూడా టికెట్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నించాడు. వాళ్లు కూడా తమకేమీ తెలియదని సమాధానమివ్వడంతో.. కోపం పట్టలేక.. దాని ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

‘‘ విండో సీట్‌ కోసం టికెట్‌ ధర కంటే ఎక్కువగానే చెల్లించా. కానీ ప్రయోజనం లేకపోయింది’’ అంటూ రాసుకొచ్చాడు.  దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ మీరు ‘విండోస్‌’ యూజర్‌ అని వాళ్లకు తెలియకపోయి ఉంటుంది. అందుకే మీకు విండో సీట్‌ కేటాయించలేదు’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా.. గతంలో నాక్కూడా ఇలాగే జరిగింది. ఎమిరేట్స్‌ విమానంలో  నా కుమారుడి కోసం విండో సీటు బుక్‌ చేశాను. తీరా అక్కడికి వెళ్లే సరికి విండో లేదు.’ అని మరో యూజర్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని