కీలక మీటింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకొని.. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసిన ప్రధానులు

ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించేందుకు ఇద్దరు ప్రధానులు కీలక సమావేశాన్ని వదిలి బయటకు వచ్చారు. టీవీలో ఆటను చూస్తూ ఎంజాయ్ చేశారు. 

Published : 11 Jul 2024 18:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ముందడుగు వేస్తోన్న తరుణంలో అమెరికాలోని వాషింగ్టన్‌లో నాటో దేశాధినేతల సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అలాంటి కీలక భేటీ నుంచి ఇద్దరు ప్రధానులు బ్రేక్ తీసుకొని ఫుట్‌బాల్ మ్యాచ్‌ వీక్షించారు. ఇంతకీ విషయం ఏంటంటే..?

జర్మనీ వేదికగా యూఈఎఫ్‌ఏ యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ (యూరో 2024) జరుగుతోంది. బుధవారం జరిగిన ఒక సెమీఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌, ఇంగ్లండ్ తలపడ్డాయి. అదే సమయంలో వాషింగ్టన్‌లో నాటో సదస్సు జరుగుతోంది. ఆ భేటీలో ఉన్న బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌, నెదర్లాండ్స్‌ ప్రధాని డిక్‌ స్కూఫ్ కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నారు. ఇద్దరు టీవీ ముందు కూర్చొని తమ జట్ల ఆటను వీక్షించారు. తమ టీమ్‌ సభ్యులు గోల్‌కొట్టినప్పుడు ఎంజాయ్‌ చేశారు. చివరకు 2-1 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత స్టార్మర్‌కు డిక్‌ అభినందనలు తెలియజేశారు.

మ్యాచ్ చూసిన వీడియోను బ్రిటన్ ప్రధాని ఎక్స్‌ వేదికగా షేర్ చేశారు. ‘‘సరైన సమయంలో నాటో సదస్సు నుంచి బయటకు వచ్చి, స్కోర్ చెక్‌ చేసుకున్నాను. ఇంగ్లండ్ అద్భుతంగా ఆడింది’’ అని రాసుకొచ్చారు. లేబర్ నేతృత్వంలో ఇంగ్లండ్ ఓడిపోదని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దానిని ఉద్దేశించే ఆయన అలా అన్నారు. ఇక బెర్లిన్‌లో జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ఆదివారం స్పెయిన్‌, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి.

వాషింగ్టన్‌లో నాటో దేశాధినేతల సదస్సు అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సైనిక కూటమి ఎన్నడూ లేనంత శక్తిమంతంగా ఉందన్నారు . ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని జోస్యం చెప్పారు. ఉక్రెయిన్‌ కచ్చితంగా సురక్షితంగా ఉంటుందని, రష్యాకు మాత్రం రక్షణ లేదని వ్యాఖ్యానించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని