Published : 07 Jul 2022 18:26 IST

UK: బోరిస్‌ రాజీనామా వేళ.. బ్రిటన్‌ నూతన ప్రధాని ఎన్నిక ఎలా జరుగుతుంది..?

లండన్‌: అవిశ్వాస పరీక్షలో నెగ్గినప్పటికీ బ్రిటన్‌ (United Kingdom) ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ను (Boris Johnson) పదవీగండం వీడలేదు. వరుస వివాదాలు చుట్టుముట్టడంతోపాటు మంత్రులు, సొంతపార్టీ సభ్యుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఇలా బోరిస్‌పై ఒత్తిడి పెరగడంతో చివరకు ప్రధానమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో కన్జర్వేటివ్‌ పార్టీ (Conservative Party) నాయకుడి ఎన్నిక మరోసారి అనివార్యమయ్యింది. ఈ క్రమంలో కన్జర్వేటివ్‌ పార్టీలో అసలు నూతన ప్రధాని ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుంది.. ఇందుకు ఏ పద్ధతిని అనుసరిస్తారనే విషయాన్ని ఓసారి చూద్దాం.

ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు కన్జర్వేటివ్‌ చట్టసభ సభ్యుల్లో (ఎంపీల్లో) ఎవరైనా ముందుకు రావచ్చు. పార్టీ నాయకుడి (ప్రధాని) కోసం ఎంతమంది ఎంపీలైనా పోటీలో ఉండవచ్చు. అయితే, వారిని కనీసం ఇద్దరు కన్జర్వేటివ్‌ సభ్యులు నామినేట్‌ చేయాల్సి ఉంటుంది.

ఇలా చాలామంది పోటీలో ఉన్న నేపథ్యంలో వారి సంఖ్యను తగ్గించేందుకు అనేక రౌండ్లలో ఎన్నిక నిర్వహిస్తారు. సీక్రెట్‌ బ్యాలెట్‌ (Secret Ballot) పద్ధతిలో నిర్వహించే ఈ ఎన్నికలో తమకు ఇష్టమైన అభ్యర్థికి సొంతపార్టీ ఎంపీలు ఓటు వేయాల్సి ఉంటుంది. స్వల్ప ఓట్లు వచ్చిన వ్యక్తి పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.

పోటీలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగిలే వరకూ ఈ పద్ధతిని కొనసాగిస్తారు. గతంలో మంగళవారాలు, గురువారాల్లో మాత్రమే ఈ ఎన్నికలను నిర్వహించారు.

ఇలా చివరికి పోటీలో మిగిలిన ఇద్దరి అభ్యర్థుల్లో ఒకరిని తమ నాయకుడిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్టీ నాయకుడిని ఎన్నుకునేందుకు విస్తృత స్థాయిలో ఉండే కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ మద్దతును తెలియజేస్తారు. వీరిలో గెలుపొందిన వ్యక్తిని కొత్త నాయకుడిగా ప్రకటిస్తారు.

పార్లమెంటులో (House of Commons) మెజారిటీ కలిగిన పార్టీ తరపు అభ్యర్థే కొత్త ప్రధానిగా నియమితులవుతారు. అలా ఎన్నికైన వ్యక్తి వెంటనే మళ్లీ ఎన్నికలకు పిలుపునివ్వకూడదు. అయినా వారికి ఆ అధికారం మాత్రం ఉంటుంది.

నాయకుడి ఎన్నికకు ఎంత కాలం పడుతుంది..?

నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాయకుడిని ఎన్నుకునేందుకు ఎంత సమయం పడుతుందనే విషయం కచ్చితంగా చెప్పలేం. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంతమంది పోటీలో దిగుతారనే విషయంపైనే ఇది ఆధారపడి ఉంటుంది. 2016లో అప్పటి బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ (David Cameron) రాజీనామా చేసిన మూడు వారాల్లోపే కొత్త ప్రధానిగా థెరిసా మే (Theresa May) బాధ్యతలు చేపట్టారు. మిగతా అభ్యర్థులందరూ మధ్యలోనే పోటీ నుంచి తప్పుకోవడంతో తక్కువ సమయంలోనే అవి పూర్తయ్యాయి. 

2019లో థెరిసా మే రాజీనామా చేస్తానని ప్రకటించడంతో నూతన అభ్యర్థి ఎన్నిక అనివార్యమయ్యింది. ఆ సయమంలో బోరిస్‌ జాన్సన్‌కు పోటీగా అప్పటి మాజీ ఆరోగ్యశాఖ మంత్రి జెరెమీ హంట్‌ రంగంలో దిగారు. దీంతో బోరిస్‌ జాన్సన్‌ ఎన్నిక పూర్తయ్యేందుకు దాదాపు రెండు నెలలు సమయం పట్టింది. తాజాగా బోరిస్‌ రాజీనామా చేయడంతో కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి ఎంతమంది పోటీలో దిగుతారో చూడాల్సి ఉంది.

ఇదిలాఉంటే, బ్రిటన్‌ పార్లమెంటులో (House of Commons) మొత్తం సభ్యల సంఖ్య 650. క్రితం (2019లో) ఎన్నికల్లో 358 స్థానాల్లో గెలుపొందిన కన్జర్వేటివ్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని బాధ్యతలు చేపట్టిన బోరిస్‌ జాన్సన్‌కు పలు సవాళ్లు ఎదురుకావడంతో చివరకు ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని