bomb cyclone: అమెరికాలో హిమ విస్ఫోటం..!

అమెరికా(USA)లో బాంబ్‌ సైక్లోన్‌ (bomb cyclone)హిమ విస్ఫోటాన్నే సృష్టించింది. అక్కడ ఉష్ణోగ్రతలు -50కంటే కిందకు దిగజారిపోతున్నాయి. 

Updated : 27 Dec 2022 14:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(USA)-కెనడా(canada)ల్లో ‘బాంబ్‌ సైక్లోన్‌’((bomb cyclone)) బీభత్సం సృష్టిస్తోంది. చాలా రాష్ట్రాల్లో మంచు కొన్ని అడుగుల మేర పేరుకుపోయింది. ఎదుటి వాహనం కూడా కనిపించని స్థాయిలో వెలుతురు పడిపోయింది. ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలోనే మృతుల సంఖ్య 28కి చేరింది. అమెరికా(USA)లోని బఫెలో ప్రాంతం ఈ తుపానుకు తీవ్రంగా ప్రభావితమైంది. అమెరికా(USA)లో 20 కోట్ల మంది బాంబ్‌సైక్లోన్‌ ప్రభావానికి లోనైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే మొత్తం జనాభాలో మూడింట రెండోంతుల మంది మంచుకు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం అమెరికా(USA)లో 15 లక్షల మంది విద్యుత్తు కోతతో ఇబ్బంది పడుతున్నారు.

ఇప్పటికే గురువారం నుంచి సోమవారం వరకు అమెరికా(USA)లో 16,000 విమాన సర్వీసులను రద్దు చేశారు. చాలా ఎయిర్‌పోర్టులను మూసివేశారు. వీటిల్లో బఫెలో నయాగరా కూడా ఉంది. దీనిని శుక్రవారం మూసివేశారు. దాదాపు 600 మంది మోటరిస్టులు మంచులో చిక్కుకుపోగా ఫస్ట్‌ రెస్పాండర్లు రక్షించారు.

అమెరికా(USA)లో పది రాష్ట్రాలకు తుపానుపై అప్రమత్తంగా ఉండాలని  ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వీటిల్లో మాంటెన్నా, నార్త్‌ డకోటా, సౌత్‌ డకోటా, మిన్నెసోటా, ఐయోవా, ఇండియానా, మిషిగాన్‌, నెబ్రాస్కా, విస్కిన్సన్‌, న్యూయార్క్‌ ఉన్నాయి.  

గతంలో  ఎన్నడూ లేని విధంగా చాలా నగరాల్లో -40 డిగ్రీల కంటే తీవ్రమైన చలి నమోదవుతోంది. నప్లెస్‌లో -52 డిగ్రీల చలి నమోదైంది. మియామీలో కూడా -50 డిగ్రీలు చలి రికార్డైంది. బఫెలో ప్రాంతంలో నిరంతరాయంగా 37.25 గంటలపాటు (బ్లిజార్డ్‌ కండీషన్స్‌) మంచుతుపాను పరిస్థితులు నెలకొన్నాయి. గంటకు 35 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో గాలి వీస్తే ఈ పరిస్థితులు ఉన్నట్లు భావిస్తారు. శుక్రవారం ఉదయం గంటకు 71 మైళ్ల వేగంతో చలిగాలులు వీచాయి.

న్యూయార్క్‌లోని స్నైడర్‌లో 56 అంగుళాల మేర మంచు కురిసింది. మిషిగన్‌లోని బరగాలో 42 అంగుళాలు, న్యూయార్క్‌లోని వాటర్‌ టౌన్‌లో 34 అంగుళాల మంచు పడింది.

బాంబ్‌ సైక్లోన్‌ అంటే ఏమిటీ..?

చాలా వేగంగా తుపానుగా మారే దానిని వాతావరణ శాస్త్రజ్ఞులు బాంబ్‌సైక్లోన్‌గా అభివర్ణిస్తారు. వాతావరణంలో చల్లటి గాలి, వెచ్చటి గాలి కలిసిన సమయంలో ఇది ఏర్పడుతుంది. వెచ్చటి గాలి పైకి ఎగసి తక్కువ పీడనం ఏర్పడుతుంది. వాతావరణంలోని తేమ కారణంగా తుపాను మేఘాలు ఏర్పడతాయి. దీనికి వాతావరణంలో గాలి పీడనం 24 గంటల్లో 24 మిల్లీబార్లు పడిపోవడం కూడా చేరితే బాంబ్‌ సైక్లోన్‌గా మారుతుంది. భూభ్రమణ ప్రభావం కూడా దీంతో కలిసి పరిస్థితి తీవ్రంగా మారుతుంది. ఇప్పటికే గ్రేట్‌లేక్స్‌ ప్రాంతంలో బాంబ్‌ సైక్లోన్‌ పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికా(USA) జాతీయ వాతావరణశాఖ శాస్త్రవేత్త జాన్‌ మూర్‌ వెల్లడించారు. ధ్రువాల నుంచి వచ్చే శీతలగాలుల కారణంగా వాతావరణ పీడనం కనీసం 962 మిల్లీబార్లు పతనమైందని పేర్కొన్నారు.

న్యూయార్క్‌ గవర్నర్‌ కేథీతో అమెరికా(USA) అధ్యక్షుడు జోబైడెన్‌ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని