Buzz Aldrin: చంద్రుడిపై నడిచిన ఆల్డ్రిన్‌.. 93వ పుట్టినరోజున మళ్లీ వివాహం

50ఏళ్ల క్రితం చంద్రుడిపై నడిచిన వ్యోమగామి బజ్‌ ఆల్డ్రిన్‌ (Buzz Aldrin).. 93 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. పుట్టినరోజే వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

Published : 21 Jan 2023 14:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చంద్రుడి (Moon)పై కాలుమోపిన ముగ్గురు అమెరికా వ్యోమగాముల్లో ఒకరైన బజ్‌ ఆల్డ్రిన్ (Buzz Aldrin)‌.. 93 ఏళ్ల వయసులో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల ప్రేయసి డా. ఆంకా ఫార్‌ను పుట్టినరోజు నాడే వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ.. ఫొటోలు షేర్‌ చేశారు.

శుక్రవారం (జనవరి 20న) లాస్‌ ఏంజిల్స్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా తమ వివాహం జరిగిందని ఆల్డ్రిన్‌ వెల్లడించారు. ‘‘93వ పుట్టినరోజున నా ప్రేయసి ఆంకాతో వివాహం. టీనేజ్‌లో ఇంట్లోనుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నంత ఉత్సాహంగా ఉన్నాను’’ అంటూ మాజీ వ్యోమగామి రాసుకొచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా.. ఆల్డ్రీన్‌కు ఇది నాలుగో వివాహం. అంతకుముందు మూడు సార్లు పెళ్లిచేసుకోగా భార్యల నుంచి విడాకులు తీసుకున్నారు.

ఐదు దశాబ్దాల క్రితం 1969 జులై 20న అమెరికా (US) అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా NASA) చంద్రుడిపై చేపట్టిన మానవసహిత ప్రయోగంలో ఆల్డ్రిన్‌ కూడా ఒక సభ్యుడు. అపోలో-11 (Apollo 11) వ్యోమనౌకలో అగ్రరాజ్య వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బజ్‌ ఆల్డ్రిన్‌, మైకెల్‌ కొల్లిన్స్‌ చంద్రుడిపైకి వెళ్లారు. వీరిలో నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ (Neil Armstrong) మొట్టమొదటిగా జాబిల్లిపై కాలుమోపి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. నీల్‌ అడుగుపెట్టిన 19 నిమిషాల తర్వాత ఆల్డ్రిన్‌ చంద్రుడిపై కాలుపెట్టాడు. అపోలో 11 మిషన్‌ సభ్యుల్లో ఇప్పటికీ జీవించి ఉన్న వ్యక్తి ఆల్డ్రినే. 1971లో నాసా నుంచి రిటైర్‌ అయిన తర్వాత.. ఈయన 1998లో షేర్‌స్పేస్‌ ఫౌండేషన్‌ను స్థాపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని