King Charles III: వేలానికి కింగ్‌ ఛార్లెస్‌ వివాహం నాటి కేకు ముక్క

41 ఏళ్ల క్రితం జరిగిన కింగ్‌ ఛార్లెస్ III దంపతుల వివాహం నాటి ఓ కేకు ముక్కను ఓ ప్రముఖ సంస్థ తాజాగా వేలం వేయనుంది. 1981 నుంచి ఈ కేకు ముక్కను ఓ అతిథి భద్రంగా దాచారు. ఈ విషయం ఇటీవల తెలిసింది. 

Published : 20 Oct 2022 01:40 IST

లండన్‌: బ్రిటన్‌ నూతన రాజు కింగ్‌ ఛార్లెస్ III‌, యువరాణి డయానా దంపతుల వివాహం నాటి ఓ కేకు ముక్కను వేలం వేయనున్నారు. 3000మంది అతిథుల మధ్య 1981లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, వివాహానికి వచ్చిన అతిథుల్లో ఒకరైన నిగెల్‌ రికెట్స్‌ గతేడాది మరణించారు. అయితే ఈ అతిథికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం కొద్దిరోజుల క్రితం బయటపడింది. ఆ వివాహానికి సంబంధించిన కేకు ముక్కను నిగెల్‌ 41 ఏళ్లుగా భద్రంగా దాచారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చారు. దీంతో ఆ కేకు ముక్కను ప్రముఖ సంస్థ డోర్‌ అండీ రీస్‌ వేలం వేయనుందని న్యూయార్క్‌ పోస్ట్‌ తెలిపింది.

ఈ వేలాన్ని 300 పౌండ్ల (దాదాపు రూ.27వేలు) నుంచి మొదలుపెట్టే అవకాశాలున్నాయి. అయితే, అంచనాలను మించి అధిక ధరకు అమ్ముడుపోయే అవకాశాలున్నాయని వార్తాసంస్థ పేర్కొంది. 41 ఏళ్ల క్రితం ఎలాగైతే ప్యాక్‌ చేసి విక్రయించారో.. ఈ ముక్కను కూడా అదేవిధంగా ప్యాక్‌ చేసి వేలం వేసేందుకు అంతా సిద్ధమయ్యారు. నాడు వివాహంలో ఛార్లెస్‌ దంపతులు మొత్తంగా 23 కేకులు కోశారని.. ఈ ముక్క ఫ్రూట్‌ కేకులోని ఓ భాగంగా గుర్తించారు. వారి వివాహానికి సంబంధించిన ఓ కేకు ముక్కను 2014లో ఇదే సంస్థ వేలం వేయగా నాడు 1,375 పౌండ్లు (దాదాపు రూ.1.27లక్షలు) పలికింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని