Cambodia: ఇటుక బట్టీలో పెట్టి.. రూ.584 కోట్ల విలువైన డ్రగ్స్‌ కాల్చేసి!

కంబోడియా దేశం రూ.584 కోట్ల విలువైన అక్రమ డ్రగ్స్‌, సంబంధిత పదార్థాలను దహనం చేసింది.

Published : 15 Jun 2024 00:10 IST

ఫనామ్‌పెన్‌: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాటంలో భాగంగా కంబోడియా (Cambodia) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఏకంగా రూ.584 కోట్ల (70 మిలియన్ల డాలర్లు) విలువైన ఏడు టన్నులకుపైగా అక్రమ డ్రగ్స్‌, సంబంధిత పదార్థాలను దహనం చేసింది. జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసే మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే.. వాటి కట్టడికి ఉత్తమ మార్గమని ఓ అధికారి తెలిపారు.

దేశంలోని ఆయా ప్రాంతాల్లో పట్టుబడిన ఈ డ్రగ్స్‌ను రాజధాని ఫనామ్‌పెన్‌ శివార్లలో ఓ ఇటుక బట్టీలో ఉంచి కాల్చేసినట్లు మాదకద్రవ్యాల నిరోధక సంస్థ సెక్రెటరీ జనరల్ జనరల్ మీస్ విరిత్ తెలిపారు. ఇందులో 4.1 టన్నులు ఆయా రకాల డ్రగ్స్‌ కాగా, వాటి ఉత్పత్తికి ఉపయోగించే రసాయనాలు, ఇతర పదార్థాలు 3.2 టన్నులు ఉన్నాయని చెప్పారు. ధ్వంసం చేసిన ఈ సరకు విలువ దాదాపు రూ.584 కోట్లు ఉంటుందని చెప్పారు. వాటిని స్వాధీనం చేసుకోకుంటే లక్షలాది మందికి ప్రమాదం వాటిల్లి ఉండేదని వెల్లడించారు.

జీ7 వేదికగా.. కృత్రిమ మేధపై పోప్‌ ఫ్రాన్సిస్‌ కీలక వ్యాఖ్యలు

ఈ ఏడాదిలో మే వరకు దేశంలో 3,800కుపైగా డ్రగ్స్‌ సంబంధిత కేసులను నమోదు చేసినట్లు జనరల్‌ విరిత్ తెలిపారు. విదేశీయులు సహా 10,000 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఐరాస వివరాల ప్రకారం.. కంబోడియాలో 2023లో 1.4 టన్నుల ‘క్రిస్టల్ మెథాంఫేటమిన్’ పట్టుబడింది. అదే ఏడాదిలో హెరాయిన్‌ స్వాధీనం రెట్టింపు అయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని