Imran khan: ఇమ్రాన్‌ ఖాన్‌ను అందుకే చంపాలనుకున్నా..: షూటర్‌

ఈ ఘటనపై నిందితుడు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నందునే ఇమ్రాన్‌ ఖాన్‌ని చంపేందుకే తాను ఇక్కడికి వచ్చానని నిందితుడు వెల్లడించాడు.

Published : 04 Nov 2022 01:14 IST

ఇస్లామాబాద్‌: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) కంటెయినర్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వజీరాబాద్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు కంటెయినర్‌పైకి ఎక్కిన సందర్భంలో నిందితుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇమ్రాన్‌ ఖాన్‌ కుడి కాలికి గాయం కాగా.. పీటీఐ పార్టీకి చెందిన మరికొందరు నేతలకు గాయాలయ్యాయి.  వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై నిందితుడు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నందునే ఇమ్రాన్‌ ఖాన్‌ని చంపేందుకే తాను ఇక్కడికి వచ్చానని నిందితుడు వెల్లడించాడు. ఈ లాంగ్‌ మార్చ్‌  నేపథ్యంలో ఆయన ప్రజల్ని తప్పుదోవపట్టిస్తుంటే చూస్తూ భరించలేకపోతున్నానని.. అందుకే ఆయన్ను చంపేందుకు ప్రయత్నించినట్టు తెలిపాడు. ఇమ్రాన్‌ ఖాన్‌ను మాత్రమే తాను చంపాలనుకున్నానని.. ఇంకెవరినీ కాదన్నాడు. అందుకే ఇమ్రాన్‌ లాహోర్‌ దాటినప్పట్నుంచి ఆయన్ను చంపేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు వివరించాడు. అయితే, ఈ ఘటనలో ఇద్దరు కాల్పులు జరిపినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో నిందితుడు స్పందిస్తూ.. తాను ఒక్కడినేనని.. తనతో ఇంకెవరూ లేరని సమాధానం ఇచ్చాడు. 

ఇమ్రాన్‌పై కాల్పుల్ని ఖండించిన నవాజ్‌ షరీఫ్‌

ఇంకోవైపు,  ఈ ఘటనను పీఎంఎల్‌-ఎన్‌ అధినేత, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఖండించారు. ఈ ఘటనలో గాయపడినవారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనపై పీఎంఎల్‌-ఎన్‌ ఉపాధ్యక్షురాలు మరయం నవాజ్‌ కూడా స్పందించారు. ఇమ్రాన్‌ ఖాన్‌పై కాల్పుల్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో గాయపడినవారంతా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్‌ చేశారు. పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ కూడా ఈఘటనను ఖండిస్తూ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని