Omicron: ఒమిక్రాన్‌ తర్వాత.. ‘లాంగ్‌ కొవిడ్‌’ ప్రభావం ఉంటుందా..?

లాంగ్‌కొవిడ్‌ ప్రభావాలపై ఇప్పుడే కచ్చితమైన నిర్ధారణకు రావడం తొందరపాటే అయినప్పటికీ.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం దీర్ఘకాలంలో ఉండవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 10 Feb 2022 01:37 IST

నిపుణులు ఏం చెబుతున్నారంటే

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 నుంచి కోలుకున్న తర్వాత బాధితుల ఆరోగ్యంపై దీర్ఘకాలంలో వైరస్‌ ప్రభావం ఏమేరకు ఉంటుందనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, వీటిపై ఇప్పుడే కచ్చితమైన నిర్ధారణకు రావడం తొందరపాటే అయినప్పటికీ.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం దీర్ఘకాలంలో ఉండవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తీవ్ర కొవిడ్‌ బారినపడిన వారిలో కొన్ని లక్షణాలు దీర్ఘకాలంలో వేధించే అవకాశం ఉందంటున్నారు.

‘కొవిడ్‌-19తో చాలా వారాలపాటు పోరాడిన వారిలో ఎక్కువగా లాంగ్‌ కొవిడ్‌ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన మొదట్లో కనిపించిన లక్షణాలు దాదాపు 90 రోజులపాటు అదేవిధంగా కొనసాగితే దానిని లాంగ్‌ కొవిడ్‌గా పరిగణిస్తారు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మరియా వాన్‌ కెర్ఖోవ్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న మొత్తం బాధితుల్లో దాదాపు మూడోవంతు మందిలో లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అలసట, బ్రెయిన్‌ ఫాగ్‌, శ్వాస ఆడకపోవడం, ఆందోళనతోపాటు ఇతర సమస్యలు వేధించే అవకాశం ఉందన్నారు. కొవిడ్‌ కారణంగా ఆస్పత్రిలో చేరినవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని.. అంతేకాకుండా స్వల్ప లక్షణాలు కనిపించిన వారిలోనూ ఈ ప్రభావాలు ఉండే అవకాశం ఉన్నట్లు తాజా పరిశోధనలు చెబుతున్నాయని గుర్తుచేశారు.

ప్రస్తుతానికి లాంగ్‌కొవిడ్‌ గురించి కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ ఇటువంటి బాధితుల సంఖ్య రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ లిండా గెంగ్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండడంతోపాటు వాటిని అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో చూపించే ఇటువంటి లాంగ్‌ కొవిడ్‌ సమస్యకు టీకాలే పరిష్కారం చూపుతాయా? అనే కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలను టీకాలు తగ్గించే సాధ్యాసాధ్యాలపై యేల్‌ యూనివర్సిటీ బృందం ఇప్పటికే అధ్యయనం చేపట్టింది. ఇదే సమయంలో కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌కు గురికాకముందే వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఇటువంటి సమస్యలను నిరోధించడంతోపాటు దీర్ఘకాలంలో వచ్చే లక్షణాల తీవ్రతను తగ్గించవచ్చని ఇప్పటికే రెండు అధ్యయనాలు పేర్కొన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని