Canada: ఆధారాలు లేకుండా ట్రూడో ఆరోపణలా..? భారత్‌కు మద్దతుగా శ్రీలంక మంత్రి

కెనడాతో వివాదం విషయంలో భారత్‌కు మద్దతుగా శ్రీలంక స్పందించింది. కెనడా ప్రధాని ట్రూడో ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నారని శ్రీలంక విదేశాంగ మంత్రి విమర్శించారు. అంతేకాదు.. శ్రీలంక తీరంలో లంగరేయడానికి చైనా పరిశోధన నౌకకు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.

Published : 26 Sep 2023 11:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడా(Canada)తో వివాదం విషయంలో భారత్‌కు పొరుగు దేశమైన శ్రీలంక (Sri Lanka) నుంచి మద్దతు లభించింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అలీ సబ్రీ తాజాగా ఓ ఆంగ్ల వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జస్టిన్‌ ట్రూడో ఎటువంటి ఆధారాలు ఇవ్వకుండా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘కొందరు ఉగ్రవాదులకు కెనడా సురక్షితమైన అడ్డాగా మారింది. ఎటువంటి ఆధారాలు లేకుండానే కెనడా ప్రధాని దారుణమైన ఆరోపణలతో ముందుకొచ్చినట్లు అనిపిస్తోంది. ఇలాంటి ఆరోపణలనే శ్రీలంకపై కూడా చేశారు. మా దేశంలో ఎటువంటి హత్యాకాండ జరగలేదని అందరికీ తెలుసు. బలహీనమైన ఆరోపణలతో ట్రూడో ముందుకు రావడాన్ని చూసి నేనేమీ ఆశ్చర్యపోలేదు. నాజీలతో కలిసి పనిచేసిన వారికి ట్రూడో స్వాగతం పలకడం నిన్న చూశాను. అందుకనే ఆయన చర్యలు ప్రశ్నార్థకం’’ అని వ్యాఖ్యానించారు.

చైనా పరిశోధన నౌకకు అనుమతులు లేవు..

చైనా పరిశోధన నౌక షియాన్-6 అక్టోబర్‌లో శ్రీలంకకు రానుంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై శ్రీలంక మంత్రి అలీ సబ్రీ మాట్లాడుతూ తాము అనుమతులు ఇవ్వడానికి ఓ విధానం ఉందని పేర్కొన్నారు. తాము భారత్‌ సహా మిత్రదేశాలను సంప్రదిస్తామన్నారు. ‘‘గతంలో కూడా ఇటువంటి చర్చ చాలాకాలం జరిగింది. మేము ఒక ఎస్‌వోపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌)తో ముందుకు వచ్చాం. దీనిని తయారు చేసే సమయంలో మేము మిత్రులను సంప్రదించాం. వీటిల్లో భారత్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో చైనా నౌక మా నిబంధనలు పాటిస్తే ఎటువంటి సమస్య లేదు. పాటించకపోతే మాత్రం మాకు అభ్యంతరాలున్నాయి. నాకు తెలిసినంత వరకు షియాన్‌-6కు అనుమతులు ఇవ్వలేదు. చర్చలు జరుగుతున్నాయి. భారత్‌ ఆందోళనలు వాస్తవమైనవి. మాకు అవి చాలా ముఖ్యం. మా ప్రదేశాన్ని శాంతియుతంగా ఉంచాలని మేము ఎప్పుడూ చెబుతుంటాం’’ అని పేర్కొన్నారు. విదేశీ నౌకలు, విమానాలు శ్రీలంక పరిధిలో ప్రయాణించే సమయంలో ఎస్‌వోపీని పాటించాల్సిందేన్నారు.  

భారత్‌ కీలక భాగస్వామే.. కానీ..!

చైనాకు చెందిన పరిశోధన నౌక షియాన్‌-6 అక్టోబర్‌లో శ్రీలంక తీరంలో లంగరేయనుంది. ఇక్కడ ఆ నౌక పలు పరిశోధనలు నిర్వహించనుంది. మరోవైపు అమెరికా అండర్‌ సెక్రటరీ విక్టోరియా నూలాండ్‌ ఇటీవల శ్రీలంక విదేశాంగశాఖ మంత్రితో భేటీ అయిన సమయంలో ఈ నౌక విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని