China: హువావేపై నిషేధం విధించనున్న కెనడా!

చైనా అగ్రశ్రేణి టెలికమ్యూనికేషన్స్‌ సంస్థలైన హువావే, జెడ్‌టీఈలను కెనడా 5జీ నెట్‌వర్క్‌ నుంచి నిషేధించనుంది. ఈ మేరకు రెండు సంస్థలపై కొన్ని ఆంక్షలను కెనడా పరిశ్రమల శాఖ

Updated : 20 May 2022 15:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా అగ్రశ్రేణి టెలికమ్యూనికేషన్స్‌ సంస్థలైన హువావే, జడ్‌టీఈలను కెనడా 5జీ నెట్‌వర్క్‌ నుంచి నిషేధించనుంది. ఈ మేరకు రెండు సంస్థలపై కొన్ని ఆంక్షలను కెనడా పరిశ్రమల శాఖ  మంత్రి ఫ్రాకోయిస్‌ ఫిలిప్‌ ప్రకటంచారు. ఈ చర్యతో కెనడా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు మెరుగుపడనున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు ఈ సంస్థలపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బాటలోనే కెనడా ప్రయాణించనుంది.

కెనడా రాజధాని ఒట్టావలో ఫ్రాంకోయిస్‌  విలేకర్లతో మాట్లాడుతూ ‘‘మా ఇంటెలిజెన్స్‌సంస్థలు విశ్లేషించిన తర్వాత.. మిత్రదేశాలతో సంప్రదింపులు జరిపే ఈ నిర్ణయం ప్రకటించాం. ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మా ప్రజల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తాం. ఈ క్రమంలో మా టెలికామ్‌ నెట్‌వర్క్‌ సురక్షితంగా ఉండేందుకు అవసరమైన ఏ చర్య అయినా తీసుకొంటాం. 5జీ ప్రపంచంలో రోజువారీ పనుల కోసం మనం మరింతగా నెట్‌వర్క్‌లపై ఆధారపడతాం. మాది సరైన నిర్ణయమే’’ అని పేర్కొన్నారు.

ఈ నిర్ణయంపై కెనడాలోని చైనా దౌత్య కార్యాలయ ప్రతినిధి స్పందించారు. ‘కెనడా లేవనెత్తిన భద్రతా పరమైన ఆందోళనలు.. రాజకీయంగా లేనిది ఉన్నట్లు చూపించే ప్రయత్నం’ అని విమర్శించారు. అంతేకాదు, కెనడా, అమెరికాలు కలిసి చైనా కంపెనీలను అణచివేసేందుకు యత్నిస్తున్నాయని పేర్కొన్నారు. జడ్‌టీఈ, హువావే సంస్థలు దీనిపై స్పందించలేదు.

కోల్డ్‌ వార్‌ సమయంలో అమెరికా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్‌ షేరింగ్‌ గ్రూప్‌ ‘ఫైవ్‌ఐస్‌’లో కెనడా కూడా సభ్యదేశం. మిగిలిన సభ్యదేశాలైన అమెరికా, యూకే,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఇప్పటికే ఈ సంస్థలపై ఆంక్షలు విధించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని