Canada wildfires: కెనడాలో మంట.. అమెరికాలో తంటా!

ఇంట్లోంచి బయటకు రాకండి.. ఆరోగ్యాలు పాడవుతాయి.. తలుపులు మూసేయండి! మాస్కులు పెట్టుకోండి! కెనడాలో పరిస్థితిని అదుపులోకి తేవటానికి సాయం చేస్తున్నాం.. ఇది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తమ దేశ ప్రజలకు, ముఖ్యంగా తూర్పు ప్రాంత రాష్ట్రాలవాసులకు చేసిన హెచ్చరిక.

Updated : 09 Jun 2023 10:07 IST

న్యూయార్క్‌లో ప్రమాదకర స్థితిలో వాయుకాలుష్యం
పలు రాష్ట్రాలకు బైడెన్‌ హెచ్చరిక
విమాన ప్రయాణాలు, టోర్నీలకు అంతరాయం

ఇంట్లోంచి బయటకు రాకండి.. ఆరోగ్యాలు పాడవుతాయి.. తలుపులు మూసేయండి! మాస్కులు పెట్టుకోండి! కెనడాలో పరిస్థితిని అదుపులోకి తేవటానికి సాయం చేస్తున్నాం.. ఇది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తమ దేశ ప్రజలకు, ముఖ్యంగా తూర్పు ప్రాంత రాష్ట్రాలవాసులకు చేసిన హెచ్చరిక. అమెరికా వాతావరణ శాఖ కూడా ఇలాంటి హెచ్చరికే జారీ చేసింది. కెనడాలో బాగోలేకుంటే అమెరికన్లు ఇళ్లకు పరిమితమవడం ఎందుకు? అసలు కెనడాలో ఏమైంది? అమెరికా ఎందుకు జాగ్రత్త పడుతోంది?

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌, న్యూజెర్సీ, బోస్టన్‌, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్‌ డీసీ, రాలీ, కొలంబియా సిన్సినాటి, క్లీవ్‌లాండ్‌, డెలావేర్‌, పెన్సిల్వేనియా, సౌత్‌ కరోలినాలాంటి చోట్ల రెండు రోజులుగా దట్టమైన పొగలు ఆవరించాయి. చాలాచోట్ల ఆకాశానికి ఊదారంగు దుమ్ముదుప్పటి కప్పుకొన్నట్లుంది. స్కూళ్లలో బయటి కార్యకలాపాలు రద్దు చేశారు. న్యూయార్క్‌ పట్టణంలోనైతే.. బుధవారం వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. ప్రమాదకర స్థాయిలో 500 ఏక్యూఐ నమోదైంది. 1999లో వాయునాణ్యతను రికార్డు చేయటం మొదలెట్టిన తర్వాత న్యూయార్క్‌లో ఈ స్థాయిలో ఏక్యూఐ నమోదవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఏక్యూఐ 300 దాటితే  ప్రమాదకరంగా పరిగణిస్తారు. అందుకే.. అమెరికా వాతావరణ శాఖ అనేక రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు మాస్కులు ధరించాలని సలహా ఇచ్చింది. బైడెన్‌ సైతం ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. ‘‘మనం ప్రస్తుతం ప్రమాదకర వాయుకాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా అనారోగ్య సమస్యలున్నవారు అధికారులు చెప్పినట్లు విని... ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి’’ అని ఆయన సూచించారు. ఫిలడెల్ఫియాలో మేజర్‌ లీగ్‌ బేస్‌బాల్‌ టోర్నీని వాయిదా వేశారు. విమాన ప్రయాణాలకూ అంతరాయం కలుగుతోంది. ఇంతకూ అమెరికాలో ఉన్నట్టుండి ఇదంతా ఎందుకు జరుగుతోంది? పొగ ఎందుకు కమ్ముకుంటోందంటే.. సమస్యకు మూలం కెనడాలో ఉంది!


చరిత్రలో ఎన్నడూ లేనంతగా..

కెనడాలో అనేక రాష్ట్రాల్లో వేసవి ఆరంభంలోనే కార్చిచ్చు అంటుకుంది. దాదాపు 500 చోట్ల అడవులు అంటుకొని మండుతున్నాయి. ఏటా కెనడా అడవుల్లో కార్చిచ్చు సర్వసాధారణమే. అయితే అది ప్రతిసారీ పశ్చిమ రాష్ట్రాలకే పరిమితమయ్యేది. ఈసారి మాత్రం తూర్పు ప్రాంత రాష్ట్రాలైన నోవా స్కాటియా, క్యూబెక్‌, ఆంటారియోలాకూ విస్తరించటంతో కెనడా ఉక్కిరిబిక్కిరవుతోంది. రికార్డు స్థాయిలో ఈసారి కార్చిచ్చు అంటుకుందని చెబుతున్నారు. వేసవి ఆరంభంలోనే దాదాపు 80 లక్షల ఎకరాల్లో ఈ మంటలు విస్తరించాయి. ఏప్రిల్‌లో బ్రిటిష్‌ కొలంబియా, అల్బర్టాల్లో మొదలైన కార్చిచ్చు కారణంగా 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ చమురు ఉత్పత్తి కూడా నిలిపివేయాల్సి వచ్చింది. ఒటావా, టొరంటో నగరాల్లోని ప్రజలకు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. ఒటావాలోని కొన్ని ప్రాంతాల్లోనైతే దట్టంగా కమ్ముకున్న పొగ కారణంగా ఏమీ కనిపించటం లేదు. కెనడా అడవుల్లోని మంటల పొగ.. గాలిలో ప్రయాణించి పక్కనే ఉన్న అమెరికా రాష్ట్రాలను కమ్ముకుంటోంది. మరోవారంపాటు ఈ పొగ ప్రభావం ఇలాగే కొనసాగొచ్చంటున్నారు. మానవ తప్పిదాలతోపాటు వాతావరణ మార్పుల కారణంగానే కార్చిచ్చు విస్తరిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాన్ని నియంత్రించటానికి కెనడా ఇతర దేశాల.. ముఖ్యంగా అమెరికా సాయాన్ని కోరుతోంది. ఇప్పటికే 600 మంది అగ్నిమాపక సిబ్బందిని కెనడాకు పంపించాలని అధ్యక్షుడు బైడెన్‌ ఆదేశించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి కూడా త్వరలోనే బృందాలు ఆ దేశానికి రాబోతున్నాయి. మరోవైపు కెనడా కార్చిచ్చు పొగ తమ వరకూ విస్తరించవచ్చని నార్వే ఆందోళన చెందుతోంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు