India-Canada: ‘ఆరోపణలు నిజమని తేలితే..’: భారత్‌తో ఉద్రిక్తతల వేళ కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు

India-Canada Diplomatic Row: భారత్‌తో బంధం తమకు ముఖ్యమైనదే అయినప్పటికీ.. తమ దేశ పౌరులను రక్షించుకోవడం తమ బాధ్యత అని కెనడా రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్‌ హత్య కేసులో దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు.

Published : 25 Sep 2023 10:30 IST

టొరంటో: ఖలిస్థానీ అంశంతో భారత్‌, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివాదంపై కెనడా (Canada) రక్షణ మంత్రి బిల్‌ బ్లెయిర్‌ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ (India)తో బంధం తమకు ‘ముఖ్యమైనదే’ అని పేర్కొన్న ఆయన.. నిజ్జర్‌ హత్య కేసులో దర్యాప్తు తప్పకుండా కొనసాగుతుందని తెలిపారు. (India Canada Diplomatic Row)

‘‘నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌పై ఉన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగిస్తాం. అదే సమయంలో దిల్లీతో మా భాగస్వామ్య బంధం కూడా కొనసాగుతుంది. భారత్‌తో బంధం మాకు ‘ముఖ్యమే’. అయితే, ఈ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఇది సవాల్‌తో కూడుకున్న సమస్యగా మారుతుందని మాకు తెలుసు. కానీ, మా చట్టాలను గౌరవించడం, మా పౌరులను రక్షించుకోవడం మా బాధ్యత. అందుకోసం.. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి అసలు నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఈ ఆరోపణలు నిజమైతే.. అది చాలా ఆందోళనకర అంశంగా మారుతుంది. మా గడ్డపై మా పౌరుడిని (నిజ్జర్‌ను ఉద్దేశిస్తూ) హత్య చేయడం మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే’’ అని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెనడా మంత్రి (Canada Minister) బ్లెయిర్‌ వ్యాఖ్యానించారు.

కెనడాకు సమాచారమిచ్చింది అమెరికాయే

ట్రూడోకు జైశంకర్‌ కౌంటర్‌..

మరోవైపు నిజ్జర్‌ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) మరోసారి గట్టిగా బదులిచ్చారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న ఆయన భారత్‌, కెనడా మధ్య ఉద్రిక్తతలను గురించి ప్రస్తావిస్తూ.. ట్రూడోపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘‘స్వేచ్ఛ పేరుతో ఎలాగైతే చాలా పనులు జరుగుతున్నాయో.. మార్కెట్‌ పేరుతోనూ చాలా జరుగుతాయి’’ అని జైశంకర్‌ అన్నారు.

ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చంటూ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం మొదలైన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య పరస్పర విమర్శలు, దౌత్యవేత్తల బహిష్కరణలు జరిగాయి. కాగా.. కెనడా ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అవన్నీ రాజకీయ ప్రేరేపితమేనని కొట్టిపారేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని