China: బీజింగ్‌లో ఒమిక్రాన్‌ కేసుకు కెనడా పార్సిలే కారణం.. చైనా వాదన!

కరోనా కట్టడి విషయంలో చైనా కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. జీరో కొవిడ్‌ విధానాలతో లక్షలాది మందిని లాక్‌డౌన్‌లోకి నెడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల బీజింగ్‌లో మొదటి ఒమిక్రాన్‌ కేసు బయటపడింది. అయితే, ఈ కేసుకు.. కెనడా నుంచి వచ్చిన ఓ...

Published : 18 Jan 2022 15:45 IST

కొట్టిపారేసిన కెనడియన్‌ అధికారులు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కట్టడి విషయంలో చైనా కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. జీరో కొవిడ్‌ విధానాలతో లక్షలాది మందిని లాక్‌డౌన్‌లోకి నెడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల బీజింగ్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు బయటపడింది. అయితే, ఈ కేసుకు.. కెనడా నుంచి వచ్చిన ఓ పార్సిలే కారణమై ఉంటుందని ‘బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్’ అనుమానం వ్యక్తం చేసింది. ఇటీవల స్థానికంగా ఓ యువతి.. కెనడా నుంచి అమెరికా, హాంకాంగ్‌ మీదుగా మూడు రోజుల్లో బీజింగ్‌కు చేరుకున్న ఓ పార్సిల్‌ను అందుకున్నారు. అనంతరం ఆమెకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ సోకినట్లు నిర్ధరణ అయింది.

మరోవైపు చైనా వాదనను.. కెనడియన్ ఆరోగ్య అధికారులు తోసిపుచ్చారు. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి జీన్ వైవ్స్ డుక్లోస్ ఈ అభిప్రాయాన్ని అసాధారణమైనదిగా అభివర్ణించారు. చైనా ఆరోపణలు సరికావన్నారు. కెనడా ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్‌ సుప్రియా శర్మ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ప్యాకేజీలు అంతర్జాతీయ రవాణా మాధ్యమాల ద్వారా వెళ్తాయి కాబట్టి.. వాటిపై వైరస్‌ మనుగడ సాగించడం అసాధ్యమన్నారు. ఈ విధంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదని స్పష్టం చేశారు. కెనడా ప్రతిపక్ష నేత ఎరిన్ ఓ టూల్ డ్రాగన్‌ వాదనలను హాస్యాస్పదమని కొట్టిపారేశారు.

కొవిడ్‌ వ్యాప్తి మొదలు.. పార్శిళ్లు, సరకుల ద్వారా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళనలు ఉన్నా.. ఈ విధంగా కరోనా వ్యాపించినట్లు ఇప్పటి వరకు బలమైన ఆధారాలు లేవు. కానీ, చైనా మాత్రం ఇటీవల డ్రాగన్‌ ఫ్రూట్‌లపై వైరస్‌ జాడలు ఉన్నాయంటూ.. పొరుగున ఉన్న వియత్నాం నుంచి ఆ పండ్ల దిగుమతులపై నిషేధం విధించింది. సూపర్‌ మార్కెట్లనూ మూసివేయించింది. ఫిబ్రవరిలో బీజింగ్‌  వింటర్ ఒలింపిక్స్‌ ఆతిథ్యమివ్వనున్న దృష్ట్యా.. చైనా అధికారులు వైరస్‌ నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని