Canada: నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి

భారత వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టే ఖలిస్థానీ ఉగ్రవాదుల పట్ల కెనడా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మరోసారి రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి ఆజ్యం పోసింది. ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు గురై ఏడాదైన సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం మంగళవారం ప్రత్యేకంగా నివాళులర్పించింది.

Updated : 20 Jun 2024 06:38 IST

నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి
ఖలిస్థానీ ఉగ్రవాదిని స్మరించడంపై మండిపడిన భారత్‌

ఒట్టావా: భారత వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టే ఖలిస్థానీ ఉగ్రవాదుల పట్ల కెనడా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మరోసారి రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి ఆజ్యం పోసింది. ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు గురై ఏడాదైన సందర్భంగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం మంగళవారం ప్రత్యేకంగా నివాళులర్పించింది. ఏకంగా దేశ పార్లమెంటులోని దిగువ సభలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించగా ఎంపీలందరూ నిలబడి మౌనం పాటించారు. సభలో ఉన్న వివిధ పార్టీల సభ్యులందరూ చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినందున నిజ్జర్‌ జ్ఞాపకార్థం మౌనం పాటించామని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ స్పీకర్‌ తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ట్రూడో సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఒక దేశం ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న వ్యక్తికి పార్లమెంటులో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి’’ అంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. 2023 జూన్‌ 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్‌ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆ వ్యాఖ్యలను భారత్‌ ఖండించింది. ఏ ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. 

 ఉగ్రవాదంపై పోరు  కొనసాగుతుంది: భారత్‌

ప్రపంచ మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాదంపై పోరులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని భారత్‌ పునరుద్ఘాటించింది. ఇదే సమస్యపై అన్ని దేశాలతో కలిసి పనిచేస్తామని తెలిపింది. ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తికి కెనడా పార్లమెంటు నివాళులర్పించడంపై గట్టిగా స్పందించింది. 1985లో ఎయిర్‌ ఇండియా కనిష్క విమానంలో ఖలిస్థానీ ఉగ్రవాది అమర్చిన బాంబు పేలడంతో మృతి చెందిన 329 మందికి ఈ నెల 23న నివాళులర్పిస్తామని తెలిపింది. ఆ విషాధ ఘటన జరిగి 39 ఏళ్లు అయిన సందర్భంగా స్మారక సభను నిర్వహిస్తున్నట్లు కెనడాలోని ఇండియా కాన్సులేట్‌ జనరల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. మృతులందరి జ్ఞాపకార్థం ఈ నెల 23న సాయంత్రం ఆరున్నర గంటలకు వాంకోవర్‌లోని స్టాన్లీ పార్క్‌కు చెందిన సెపర్లీ ప్లే గ్రౌండ్‌లోని ఎయిర్‌ ఇండియా మెమోరియల్‌ వద్ద సంతాప సభ ఉంటుందని తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలపాలని ప్రవాస భారతీయులను కోరింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని