India-Canada: భారత్‌తో విభేదాల వేళ.. కెనడా పార్లమెంట్‌లో నిజ్జర్‌కు నివాళి

India-Canada: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య విషయంలో భారత్‌తో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ కెనడా పార్లమెంట్‌లో అతడికి సంతాపం ప్రకటించడం చర్చనీయాంశమైంది.

Published : 19 Jun 2024 10:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య ఘటన వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ కెనడా (Canada) ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. నిజ్జర్ హత్య జరిగి మంగళవారానికి (జూన్‌ 18న) ఏడాదైన సందర్భంగా ట్రూడో సర్కారు అతడికి ప్రత్యేకంగా నివాళులర్పించడం గమనార్హం. ఏకంగా దేశ పార్లమెంట్‌లో ఈ సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఎంపీలంతా లేచి నిలబడి మౌనం పాటించారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ట్రూడో (Justin Trudeau) సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఓ దేశం ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న వ్యక్తి హత్యకు దేశ పార్లమెంట్‌లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి’’ అంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

2023 జూన్‌ 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్‌ హత్య (Nijjar's killing) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్‌ (India) ఖండించింది. ఏ ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. మరోవైపు, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన కెనడా సర్కారు.. నలుగురు భారతీయులను అరెస్టు చేసింది.

ఎవరీ నిజ్జర్‌..?

ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ అధినేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar).. పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలోని భార్‌సింగ్‌ పుర గ్రామానికి చెందిన వ్యక్తి. అతడు 1997లో కెనడాకు ప్లంబర్‌గా వలస వెళ్లాడు. నాటి నుంచి ఖలిస్థానీ వేర్పాటువాదులతో బలమైన సంబంధాలు ఏర్పాటుచేసుకొన్నాడు. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ ఏర్పాటు వెనక మాస్టర్‌ మైండ్‌ అతడే. దీనిని భారత్‌ నిషేధించింది. దీంతోపాటు సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌లో కూడా సభ్యుడు. 2020లో నిజ్జర్‌ను భారత్‌ ఉగ్రవాదిగా ప్రకటించింది.

2007లో లూథియానాలో జరిగిన బాంబు పేలుడు కేసులో నిజ్జర్‌ మోస్ట్‌ వాంటెడ్‌. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 40 మంది గాయపడ్డారు. 2009లో పటియాలాలో రాష్ట్రీయ సిక్‌ సంగత్‌ అధ్యక్షుడు రూల్డాసింగ్‌ హత్యలో కూడా అతడి పాత్ర ఉన్నట్లు అభియోగాలున్నాయి. అంతేకాదు.. కెనడా, యూకే, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాలపై దాడి వెనక నిజ్జర్‌ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గతంలో కెనడా కూడా అతడిని కొంతకాలం ‘నో ఫ్లై’ జాబితాలో చేర్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని