Cannes 2022: అర్ధనగ్న ప్రదర్శన మరవకముందే.. స్మోక్‌ గ్రనేడ్లతో మహిళల నిరసన!

కేన్స్​ ఫిల్మ్ ఫెస్టివల్​లో అర్థనగ్న ప్రదర్శన మరువకముందే మరో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కొందరు నిరసనకారులు రెడ్‌ కార్పెట్‌పై గుమిగూడి రచ్చ చేశారు.......

Updated : 05 Jan 2024 15:09 IST

కేన్స్‌: ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సినీ వేడుకలో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫ్రాన్స్​లో జరుగుతున్న 75 కేన్స్​ ఫిల్మ్ ఫెస్టివల్​లో మొన్న ఓ మహిళ ఉక్రెయిన్‌కు మద్దతుగా రెడ్‌ కార్పెట్‌పై ఒక్కసారిగా దుస్తులు చించేసుకుని అర్ధనగ్నంగా నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం కొందరు నిరసనకారులు రెడ్‌ కార్పెట్‌పై గుమిగూడి రచ్చ చేశారు. పదుల సంఖ్యలో మహిళలు నల్ల దుస్తులు ధరించి బ్యానర్లు చేతబట్టి నిరసన తెలిపారు. స్మోక్ గ్రెనేడ్లు ప్రయోగించి, ఆ ప్రాంతమంతా పొగకమ్ముకొనేలా చేశారు. అనేకమంది మహిళల పేర్లు రాసిఉన్న బ్యానర్లును ప్రదర్శించారు. ఆ పేర్లు ఫ్రాన్స్​లో గృహహింస కేసుల్లో పురుషుల చేతిలో హత్యకు గురైన పలువురి మహిళలవని తెలుస్తోంది. 

ఈ ఘటన అనంతరం స్త్రీవాదానికి మద్దతుగా ‘రిపొస్టే ఫెమినిస్టే’ డాక్యుమెంటరీ తీసిన ప్రతినిధి స్పందించారు. నిరసనకారులకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఫ్రాన్స్​లో మహిళల దారుణ హత్యల నేపథ్యంలోనే డాక్యుమెంటరీని తెరకెక్కించినట్లు తెలిపారు. మహిళ హత్యల నేపథ్యంలోనే తెరకెక్కిన చిత్రం హోలీ స్పైడర్ చిత్రం ప్రీమియర్ ప్రదర్శించే సమయంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఉక్రెయిన్‌పై యుద్ధం పేరుతో అక్కడి మహిళలపై రష్యా సైనికులు సాగిస్తోన్న అకృత్యాలను నిరసిస్తూ శుక్రవారం ఓ మహిళ కేన్స్‌లో ఆందోళనకు దిగింది. రెడ్‌ కార్పెట్‌పై ఒక్కసారిగా దుస్తులు చించేసుకుని అర్ధనగ్నంగా నిరసన చేపట్టింది. ‘త్రి థౌజెండ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ లాంగింగ్‌’ సినిమా ప్రీమియర్‌ జరగ్గా.. చిత్ర బృందం ఎర్ర తివాచీపై నిలబడి ఫొటోలకు పోజులిస్తోంది. ఆ సందర్భంలో ఉన్నట్టుండి ఓ మహిళ అక్కడకు చేరుకొని, రెడ్‌ కార్పెట్‌ ఉన్న మెట్లపైకి వచ్చి తన దుస్తులను చించేసుకుంది. ఆమె ఛాతి భాగంపై ‘Stop raping us’ అనే సందేశం ఉక్రెయిన్‌ జెండా రంగులైన నీలం, పసుపు రంగు పెయింట్‌లో కనిపించింది. ‘మమ్మల్ని రేప్‌ చేయొద్దు’ అంటూ గట్టిగా అరిచింది. దీంతో అప్రమత్తమైన  భద్రతా సిబ్బంది వెంటనే ఆమెకు దుస్తులు కప్పి అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని