EU: ‘ఇది ఎవరూ ఊహించనిది.. నిజమైన యుద్ధ నేరమిదే’

యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్‌(Ukraine) నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులను ఇలాగే అడ్డుకుంటుంటే..

Published : 21 Jun 2022 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్‌(Ukraine) నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులను ఇలాగే అడ్డుకుంటుంటే.. దాని పర్యవసనాలకు రష్యా(Russia)నే జవాబుదారీగా ఉండాలని ఈయూ(EU) తాజాగా హెచ్చరించింది. ‘ఒకవైపు ప్రపంచమంతా ఆకలితో అలమటిస్తుంటే..  మరోవైపు లక్షల టన్నుల గోధుమలు ఉక్రెయిన్‌లో నిలిచిపోయాయని ఎవరూ ఊహించలేరు. ఇది నిజమైన యుద్ధ నేరం(War Crime)’ అని ఈయూ విదేశాంగ విధానం చీఫ్‌ జోసెఫ్‌ బోరెల్‌ వ్యాఖ్యానించారు. సోమవారం ఐరోపా సమాఖ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. ఆయా ప్రాంతాలను కరవు భయం వెంటాడుతోన్న వేళ.. ధాన్యం ఎగుమతులను అడ్డుకునేందుకు నల్ల సముద్రం వెంబడి ఉక్రెయిన్‌ ఓడరేవులను దిగ్బంధించడం నిలిపివేయాలని పశ్చిమ దేశాలు ఈ సందర్భంగా మాస్కోను డిమాండ్ చేశాయి.

ఆహార దిగుబడులను తరలించేందుకు ఉక్రెయిన్, రష్యా, టర్కీల మధ్య మధ్యవర్తిత్వానికి ఐరాస ప్రయత్నాలకు ఈయూ మద్దతు ఇస్తోంది. అయితే, ఇవి ముందుకు సాగడంలో విఫలమయ్యాయి. తమపై ఈయూ ఆంక్షల కారణంగానే మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికాలో ఆహార కొరత ఏర్పడుతోందని, ధరలు పెరుగుతున్నాయని రష్యా వాదిస్తోంది. అయితే, ‘ఈ సంక్షోభాన్ని సృష్టిస్తోంది యూరోపియన్ ఆంక్షలు కాదు. మా ఆంక్షలు ఆహారాన్ని, ఎరువులను లక్ష్యంగా చేసుకోవు’ అని బోరెల్ చెప్పారు. సమస్య ఉక్రెయిన్‌లో ధాన్యాల ఎగుమతులపై కట్టడి నుంచి ఉద్భవించిందని పేర్కొన్నారు.

పశ్చిమ దేశాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో.. ప్రపంచ దేశాల ఆకలితో ఆడుకోవడం మానేయాలని ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోన్నా రష్యానుద్దేశించి మండిపడ్డారు. ధాన్యాలను సరఫరాను అడ్డుకోవడం.. ప్రపంచ స్థిరత్వానికి ప్రమాదకరమని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని