Ukraine Crisis: రష్యా ఆయుధ రహస్యాలు చూసి.. అమెరికా గుండెబద్దలు..!

రష్యా దాడితో తూర్పు ఉక్రెయిన్‌లో నగరాలు గుల్లయిపోయాయి. కొన్నిచోట్ల ఉక్రెయిన్‌ దళాలు ఎదురు దాడి చేసి రష్యా సైన్యాన్ని తరిమికొట్టాయి. ఈ క్రమంలో మాస్కోసేనలకు చెందిన పలు

Updated : 30 May 2022 12:00 IST

 పశ్చిమ దేశాల చిప్స్‌ వాడి ఉక్రెయిన్‌ను గుల్ల చేసి..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

రష్యా దాడితో తూర్పు ఉక్రెయిన్‌లో నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల ఉక్రెయిన్‌ దళాలు ఎదురు దాడి చేసి రష్యా సైన్యాన్ని తరిమికొట్టాయి. ఈ క్రమంలో మాస్కో సేనలకు చెందిన పలు ఆయుధాలను, శకలాలను ఉక్రెయిన్‌ దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. ఆ ఆయుధాల్లో విడిభాగాలను పరిశీలించిన కీవ్‌ సేనలు కంగుతిన్నాయి. రష్యా వాడిన చాలా ఆయుధాల్లో కీలక ఎలక్ట్రానిక్‌ వ్యవస్థల్లో పశ్చిమ దేశాలకు చెందిన చిప్స్‌ కనిపించాయి. ముఖ్యంగా అమెరికా కంపెనీలు తయారు చేసే చిప్స్‌ వీటిల్లో విరివిగా ఉన్నాయి. దీంతో అమెరికా విధించిన టెక్‌ ఆంక్షలు రష్యాపై ఏమాత్రం ప్రభావం చూపడంలేదని తేలిపోయింది.

ఎక్కడ చూసినా అవే..

ఇటీవల ఉక్రెయిన్‌లో జరిగిన పోరులో పలు రష్యా ఆయుధాలను కీవ్‌ సేనలు స్వాధీనం చేసుకొన్నాయి. బర్నల్‌-టీ వ్యవస్థకు చెందిన రాడార్‌ డిఫెన్స్‌ కమాండ్‌ 9ఎస్‌932-1 వాహనం, పింట్‌సర్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌, కేఏ-52 అలిగేటర్‌, కేహెచ్‌-101 క్రూజ్‌ క్షిపణి వంటివి ఇందులో ఉన్నాయి.

బర్నల్‌-టీ అత్యున్నత శ్రేణి రష్యన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ. దీనిని రష్యా సైన్యం, మెరైన్‌ యూనిట్లు, ఎయిర్‌బార్న్‌ ఫోర్సుల డిఫెన్స్‌ వ్యవస్థలతో అనుసంధానిస్తారు. దీనికి ఉన్న 9ఎస్‌932-1 రాడార్‌ నిఘా, నియంత్రణ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 24 గంటలూ దీని కార్యకలాపాలు కొనసాగుతాయి. టార్‌ ఎం సిరీస్‌, 9కే35 స్టెర్లా క్షిపణి వ్యవస్థ, 9కే33 ఓశా ఎస్‌ఏఎం వ్యవస్థ, తుంగుస్కా ట్రాక్డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ, వెర్బా మ్యాన్‌ ప్యాడ్‌ వ్యవస్థలు అనుసంధానమై ఉంటాయి. ఈ కీలకమైన వ్యవస్థను ఉక్రెయిన్‌ నిపుణులు పరీక్షించగా.. అమెరికా కంపెనీల చిప్స్‌ దీని కమ్యూనికేషన్‌ వ్యవస్థల్లో దొరికాయి.

* పింట్‌సర్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలోని డైరెక్షన్‌ ఫైండర్‌ సిస్టమ్‌లో కూడా పశ్చిమ దేశాల చిప్స్‌ కనిపించాయి.

* రష్యా వినియోగించే కేహెచ్‌-101 క్రూజ్‌ క్షిపణిలో కనీసం 35 అమెరికా తయారీ చిప్స్‌ను వివిధ భాగాల్లో వినియోగించినట్లు గుర్తించారు. ప్రముఖ కంపెనీలు తయారు చేసిన చిప్స్‌ వీటిలో ఉన్నట్లు తేలింది. వాస్తవానికి ఉక్రెయిన్‌లోని లక్ష్యాల ఛేదనలో ఈ క్షిపణి విఫలమైంది.

* రష్యా వినియోగించిన కేఏ-52 అలిగేటర్‌ అటాక్‌ హెలికాప్టర్‌ ఎలక్ట్రో ఆప్టికల్‌ వ్యవస్థలో కనీసం 22 అమెరికా చిప్స్‌, ఒక కొరియా కంపెనీ చిప్స్‌ దొరికాయి.

డిష్‌ వాషర్లు, రిఫ్రిజిరేటర్ల నుంచి తీసినవి..?

సాధారణంగా ఆయుధాల్లో లక్ష్యాలను గుర్తించడానికి, ఆయుధ మార్గాన్ని నిర్దేశించడానికి, కమ్యూనికేషన్స్‌కు, ఆయుధం దాడిని నియంత్రించే పరికరాల్లో ఇంటిగ్రేటెడ్‌ చిప్‌సెట్లను వినియోగిస్తారు. రష్యా ఆయుధాల్లో దాదాపు పూర్తి స్థాయిలో పశ్చిమదేశాల చిప్‌సెట్లు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మొదలుపెట్టగానే రష్యాపై తీవ్ర ఆంక్షలను విధించారు. ఫలితంగా మాస్కో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. బ్లాక్‌మార్కెట్, రీసైక్లింగ్‌ చేసినవి‌, చైనా నుంచి వీటిని సమీకరించింది. వీటిల్లో కొన్ని చాలా పాతవి కూడా ఉన్నాయి. 

మే 11వ తేదీన అమెరికా కామర్స్‌ సెక్రటరీ గిని రైమాండో సెనెట్‌ హియరింగ్‌లో మాట్లాడుతూ.. ‘‘రష్యన్ల ఆయుధాల్లో భారీగా అమెరికా చిప్స్‌, సెమీ కండెక్టర్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని డిష్‌ వాషర్లు, రిఫ్రిజిరేటర్ల నుంచి సమీకరించారు’’ అని పేర్కొన్నారు. అమెరికా కంపెనీలు ఇప్పటికే రష్యాతో సంబంధాలు తెంపేసుకొన్నాయి.

నాటో దేశాల నుంచి రష్యాకు ఆయుధాలా..?

నాటోలోని పలు సభ్య దేశాలు రష్యాకు ఆయుధాలు ఎగుమతి చేసినట్లు ఏప్రిల్‌లో విడుదలైన ఓ నివేదిక బహిర్గతం చేసింది. దీనికోసం ‘గ్రాండ్‌ఫాదర్‌ క్లాజ్‌’ను ఉపయోగించుకొన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నిబంధన కింద రష్యాతో గతంలో కుదుర్చుకొన్న ఒప్పందాలు కొనసాగించవచ్చు. భవిష్యత్తులో చేసుకొనే ఒప్పందాలకు మాత్రమే కొత్త నిబంధనలు వర్తిస్తాయి. 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించడంతో ఈయూ ఆయుధ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ‘గ్రాండ్‌ఫాదర్‌ క్లాజ్‌’ వాడుకొని 2014 ఆగస్టు కంటే ముందు చేసుకొన్న ఒప్పందాలుగా చూపి ఐరోపా సమాఖ్య ఆంక్షలను పలు దేశాలు తప్పుదోవ పట్టించి ఆయుధ ఎగుమతులను కొనసాగించాయి. నాటో దేశాలు మొత్తం 378 మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేయగా.. వాటిల్లో ఫ్రాన్స్‌, జర్మనీల వాటా 78శాతంగా ఉంది.  వీటిల్లో బాంబులు, రాకెట్లు, క్షిపణలు, తుపాకులు వంటివి ఉన్నాయి. దీంతోపాటు ఫ్రాన్స్‌ కంపెనీలు థర్మల్‌ ఇమేజ్‌ పరికరాలు, యుద్ధవిమానాల నేవిగేషన్‌ పరికరాలను కూడా ఎగమతి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని