Britain: బ్రిటన్ ప్రధాని నివాసం వైపు దూసుకొచ్చిన కారు..!

బ్రిటన్‌ (Britain) ప్రధాని నివాసం వైపు ఓ కారు దూసుకొచ్చి ఎదురుగా ఉన్న గేట్లను ధ్వంసం చేసింది.

Updated : 26 May 2023 03:04 IST

లండన్‌: బ్రిటన్ ప్రధాని నివాసం వైపు (Britain primeminister office) వైపు ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. డౌనింగ్‌ స్ట్రీట్‌ (Downing Street)లోని ప్రధాని నివాసం, కార్యాలయం ఎదురుగా ఉన్న గేట్లను ధ్వంసం చేసింది. అప్రమత్తమైన భద్రతాబలగాలు వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశాయి. హాని తలపెట్టాలనే అనుమానం, ప్రమాదకర డ్రైవింగ్‌ కింద అతడిని విచారిస్తున్నారు. అయితే ఇది ఉగ్ర కుట్ర కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అక్కడి అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ఆపద కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడి ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. ఓ తెల్లరంగు కారు వైట్‌హాల్‌ రోడ్‌లో ప్రయాణిస్తూ ప్రధాని నివాసం గేట్లకు ఎదురుగా దూసుకొచ్చింది. అయితే ఈ సమయంలో కారు వేగం తగ్గినప్పటికీ గేట్లను మాత్రం ఢీ కొట్టింది. వెంటనే అక్కడున్న సిబ్బంది కారును చుట్టుముట్టి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

బ్రిటన్‌ పార్లమెంట్‌కు డౌనింగ్‌ స్ట్రీట్‌ షార్ట్‌కట్‌ మార్గం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో భద్రత పటిష్ఠంగా ఉంటుంది. ఫుట్‌పాత్‌లకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి ఉంటాయి. డౌనింగ్‌ స్ట్రీట్‌ ప్రవేశంలో 1989లోనే భారీ గేట్లను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఐరిష్‌ రిపబ్లిక్‌ ఆర్మీ లండన్‌లో బాంబుదాడులకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1991లో ప్రధాని నివాసంపై మరోసారి మోర్టార్‌ షెల్స్‌తో దాడి జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తున్నారు. తొలి రక్షణ వలయంగా భారీ గేట్లు, భ్రదతా సిబ్బంది ఉంటారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఆ మార్గంలోకి కారు వెళ్లేందుకు అనుమతిస్తారు. అయితే తాజా ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు