Brussels Metro: మెట్రోముందుకి మహిళను తోసేసిన యువకుడు..డ్రైవర్‌ షాక్‌లోకి!

ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఇది! బెల్జియంలోని మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి.. ప్లాట్‌ఫాంపై ఉన్న ఓ మహిళను కదులుతున్న రైలు ముందుకి ఒక్కసారిగా తోసేశాడు. అయితే, క్షణాల వ్యవధిలో మెట్రో డ్రైవర్‌ స్పందించి రైలును నిలిపేయడంతో.. ఆమె ప్రాణాలతో బయటపడ్డారు...

Published : 18 Jan 2022 01:44 IST

బ్రసెల్స్‌: ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఇది! బెల్జియంలోని మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి.. ప్లాట్‌ఫాంపై ఉన్న ఓ మహిళను కదులుతున్న రైలు ముందుకి ఒక్కసారిగా తోసేశాడు. అయితే, క్షణాల వ్యవధిలో మెట్రో డ్రైవర్‌ స్పందించి రైలును నిలిపేయడంతో.. ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకొన్నారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని రోజియర్ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మహిళను రైలు ఎదుటకు నెట్టేయడానికి ముందు ఆ వ్యక్తి ప్లాట్‌ఫాంపై అటుఇటు తిరుగుతున్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. సరిగ్గా రైలు వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమెను వెనుక నుంచి పట్టాలపైకి తోసేశాడు.

ఊహించని ఈ ఘటనతో ఆమె పట్టాలపై పడిపోగా.. మెట్రో డ్రైవర్‌ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌ వేయడంతో రైలు క్షణాల్లో ఆగిపోయింది. తోటి ప్రయాణికులు హుటాహుటిన ఆమెను పైకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో మెట్రో డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించారు.. కానీ, ఆయన కూడా షాక్‌లో ఉన్నారని బ్రస్సెల్స్ ఇంటర్‌కమ్యూనల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. అనంతరం మహిళ, మెట్రో డ్రైవర్.. ఇద్దరినీ వైద్యశాలకు తరలించారు. మరోవైపు నిందితుడు వెంటనే అక్కడినుంచి తప్పించుకొన్నాడు. అయితే, అతన్ని వెంటనే మరో మెట్రో స్టేషన్‌లో అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అతనిపై హత్యాయత్నం అభియోగాలు మోపినట్లు తెలిపారు. పోలీసులూ ఈ ఘటనపై విచారణ ప్రారంభించారని, అతని మానసిక పరిస్థితిని పరిశీలించనున్నట్లు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని