Visa Rules: విద్యార్థి వీసాల్లో మార్పుతో.. జాబ్స్‌కు బ్యాక్‌డోర్‌ బంద్‌: యూకే మంత్రి

Student Visa Rules: వలసలను తగ్గించేందుకే విదేశీ విద్యార్థులకు జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చినట్లు బ్రిటన్‌ వెల్లడించింది. దీన్ని విద్యార్థులు ఉద్యోగం పొందేందుకు బ్యాక్‌డోర్‌ మార్గంగా వాడుకుంటున్నారని పేర్కొంది.

Updated : 25 May 2023 18:41 IST

లండన్‌: విదేశీ విద్యార్థితో పాటు వారి కుటుంబ సభ్యులనూ దేశంలోకి అనుమతిస్తున్న వీసా విధానానికి బ్రిటన్‌ (Britain) ఇటీవల స్వస్తి పలికింది. ఈ మేరకు విదేశీ విద్యార్థులకు వీసాల (Student Visa)ను మరింత కఠినతరం చేసింది. అయితే, వలసలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌ (Suella Braverman) వెల్లడించారు. అంతేగాక, ఉద్యోగాల్లో బ్యాక్‌డోర్‌ ఎంట్రీలను ఇది అడ్డుకుంటుందని ఆమె పేర్కొన్నారు.

‘‘విద్యార్థులు తమ వీసాల (Visa)పై కుటుంబసభ్యులను తీసుకురావడం ఇటీవల విపరీతంగా పెరిగింది. దీంతో ప్రజాసేవలపై తీవ్ర భారం పడుతోంది. ఇకపై పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు తమ కుటుంబసభ్యులను తీసుకురాకుండా ఆంక్షలు విధించడం వల్ల వలసలు తగ్గుతాయి. అంతేగాక, విదేశీ విద్యార్థులు ఉద్యోగం పొందేందుకు దీన్ని బ్యాక్‌డోర్‌ మార్గంగా ఉపయోగించుకోవడం కూడా ఆగిపోతుంది’’ అని బ్రేవర్‌మన్‌ (Suella Braverman) ట్విటర్‌లో వెల్లడించారు.

ఈ నూతన విధానం (New Visa Rules) గురించి బ్రేవర్‌మన్‌ గత మంగళవారం కామన్స్‌ సభలో ప్రకటించారు. కొత్త నిబంధనల ప్రకారం పరిశోధనేతర పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యార్థులిక తమ కుటుంబసభ్యులను బ్రిటన్‌ (Britain)కు తీసుకెళ్లడానికి వీల్లేదు. ఇక నుంచి కేవలం పరిశోధన విభాగానికి చెందిన పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులను అభ్యసిస్తున్న విదార్థులు మాత్రమే తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లొచ్చు. ఇక, విదేశీ విద్యార్థి చదువు పూర్తికాకముందు ఉద్యోగం చేయడానికి కూడా ఇక నుంచి వీల్లేదు. దేశంలో వలసల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రిషి సునాక్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది.

ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం.. యూకే (UK)లో చట్టబద్ధ వలసల సంఖ్య 7లక్షలకు చేరుకోనుంది. విదేశీ విద్యార్థుల వీసాలపై వచ్చిన కుటుంబసభ్యుల సంఖ్య 2019లో 16వేలుగా ఉండగా.. 2022 చివరి నాటికి అది 750శాతం పెరిగి 1,36,000లకు పెరిగింది. అయితే, ఈ కొత్త నిబంధన ఎక్కువగా భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని