Ukraine Crisis: ఉక్రెయిన్‌లో చెచెన్‌ సైన్యం.. రష్యా సేనలకు మద్దతు..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అత్యంత విధేయుడిగా చెప్పుకునే చెచెన్యా అధ్యక్షుడు రంజాన్‌ కదిరొవ్‌ ఉక్రెయిన్‌లోకి అడుగుపెట్టారు.

Published : 15 Mar 2022 01:48 IST

పరిస్థితులు మరింత క్షీణించే అవకాశం

కీవ్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మరింత ముమ్మరం చేసిన రష్యా.. భీకర దాడులకు పాల్పడుతోంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా కొనసాగుతోన్న ఈ దాడుల్లో వేల మంది సైనికులు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అత్యంత విధేయుడిగా చెప్పుకునే చెచెన్యా అధ్యక్షుడు రంజాన్‌ కదిరొవ్‌ ఉక్రెయిన్‌లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే రష్యా సైన్యం చేస్తోన్న భీకర దాడులకు చెచెన్‌ సైన్యం చేతులు కలపడంతో రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌లో అత్యంత దారుణ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోన్న రష్యా సేనలు, రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ సైన్యం దీటుగా ప్రతిస్పందిస్తుండడంతో పూర్తిస్థాయిలో కీవ్‌ను సొంతం చేసుకోలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలోనే రష్యా సేనలకు మద్దతు ఇచ్చేందుకు చెచెన్‌ సైన్యం రంగంలోకి దిగింది. తాజాగా ఈ విషయాన్ని చెచెన్‌ అధినేత రంజాన్‌ కదిరొవ్‌ పేర్కొన్నారు. వీటికి సంబంధించి.. మిలటరీ యూనిఫామ్‌లో ఉన్న రంజాన్‌ కదిరొవ్‌, దురాక్రమణ ప్రణాళికను తన సైనికులకు వెల్లడిస్తోన్న వీడియోను చెచెన్‌ అధికారిక మీడియా పోస్టు చేసింది. అంతకుముందు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ మరో వీడియోను విడుదల చేసింది. హోస్తోమెల్‌లో చిత్రీకరించిందిగా భావిస్తోన్న ఆ వీడియోలో.. ‘కీవ్‌కు దాదాపు 20కి.మీ చేరువలోనే ఉన్నాం. ఉక్రెయిన్‌ సైన్యం లొంగిపోండి.. లేదంటే ఖతం చేస్తాం’ అంటూ చెచెన్‌ అధినేత చేసిన హెచ్చరికలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే, తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో పుతిన్‌ అనుకూల వేర్పాటు వాదులకు చెచెన్‌ అధినేత రంజాన్‌ కదిరోవ్‌ మద్దతు ఉంది. క్రిమియా ఆక్రమణ సమయంలోనూ రెబల్స్‌కు కదిరోవ్‌ సహకారం అందించారు. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దురాక్రమణలోనూ చెచెన్‌ సైన్యం తమవంతు సహకారం అందించేందుకు కీవ్‌కు చేరుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇలా చెచెన్‌ సైన్యం దాడులతో ఉక్రెయిన్‌ నగరాలు మరింత వణికిపోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని