Music: సంగీతానికి స్పందించే శిశు హృదయం.. పరిశోధనల్లో వెల్లడి

సంగీతమంటే భావోద్వేగాల భాష. మనోభావాలను ప్రేరేపించే, శాంతపరచే శక్తి సంగీతం సొంతం. కళాశాల విద్యార్థులు 37 శాతం సమయాన్ని సంగీతానికి కేటాయిస్తారు. అది వారికి ఆనందం, ఉత్తేజం కలిగిస్తుంది.

Updated : 12 Jan 2023 09:26 IST

డండీ (స్కాట్లాండ్‌): సంగీతమంటే భావోద్వేగాల భాష. మనోభావాలను ప్రేరేపించే, శాంతపరచే శక్తి సంగీతం సొంతం. కళాశాల విద్యార్థులు 37 శాతం సమయాన్ని సంగీతానికి కేటాయిస్తారు. అది వారికి ఆనందం, ఉత్తేజం కలిగిస్తుంది. పాత స్మృతులను తలపునకు తెస్తుంది. పిల్లలు సంగీతానికి బాగా స్పందిస్తారని మనకు తెలుసు. చాలా దేశాల్లో తరగతి గదుల్లో నేపథ్య సంగీతం వినిపిస్తూ పాఠాలు నేర్పే పద్ధతి ఉంది. నవజాత శిశువులూ సంగీతం విని ఆనందం పొందుతారు, ఏడుపు ఆపుతారని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో నిర్ధారించారు. శిశువులు ఎదుగుతున్నకొద్దీ సంతోషకర సంగీతం విని ఆనందదాయక చిత్రాలను, విషాద సంగీతం విని తదనుగుణమైన చిత్రాలను గీసే శక్తిని సంతరించుకుంటారని అధ్యయనంలో తేలింది. చిన్నపిల్లలు తల్లి పాడే జోల పాటలకు, ముద్దుముద్దు మాటలకు చక్కగా స్పందిస్తారనే అంశం నిరూపణ అయింది.

పిండదశలో కూడా సంగీతానికి స్పందించే శక్తి ఉంటుందా అని పరిశోధనలు జరపగా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గర్భం దాల్చిన 28వ వారానికి తల్లి తనకు ఇష్టమైన సంగీతం వింటూ ఉంటే, గర్భస్థ పిండం హృదయ లయ పెరిగిందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. మరికొన్ని అధ్యయనాలలో పిండస్థ శిశువు సంగీతానికి స్పందించలేదు. నెలలు నిండకుండా పుట్టి ఐసీయూలలో ఉంచిన శిశువులపై జరిపిన 10 అధ్యయనాలలో సగం మాత్రమే సంగీతం వారి ప్రవర్తనపై ప్రభావం చూపినట్లు నిర్ధారించాయి. ఏడుపు ఆపడం, నొప్పి తగ్గడం, హృదయ స్పందన రేటు, రక్తపోటు ప్రభావితం కావడం వంటివి సగం అధ్యయనాల్లోనే కనిపించాయి.

నవమాసాలు పూర్తి చేసుకుని పుట్టిన 32మంది శిశువులపై ప్రయోగాలు జరపగా ఆనందదాయక సంగీతం విన్నప్పుడు వారు నిద్రలోకి జారుకున్నారు. విషాద సంగీతం లేదా నిశ్శబ్దం వారిపై అటువంటి ప్రభావం చూపలేకపోయాయి. సంగీతంలోని భావోద్వేగాలు శిశువులను ప్రభావితం చేస్తాయి. మూడో నెల, ఆరో నెల దాటిన గర్భస్థ పిండాలకు తల్లి మాటలను, పాటలను, సంగీతాన్ని వినే శక్తి ఉంటుంది. వారు పుట్టిన తరవాత ఆ శక్తి కొనసాగుతుంది. ప్రపంచమంతటా సంగీతానికీ, పాటలకూ శిశువులు స్పందిస్తారు, ఏడుపు, అల్లరి ఆపుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని