China: చైనా పెద్దల సమక్షంలో.. రీమ్‌ నౌకాదళ స్థావరానికి భూమిపూజ..!

అమెరికా అంచనా వేసినట్లే కంబోడియాలోని రీమ్‌ నౌకాదళ స్థావరానికి భూమిపూజ నిర్వహించారు. ఈ స్థావరం అభివృద్ధికి చైనా ప్రభుత్వం నిధులను అందజేస్తోంది.

Published : 09 Jun 2022 16:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అంచనా వేసినట్లే కంబోడియాలోని రీమ్‌ నౌకాదళ స్థావరానికి భూమిపూజ నిర్వహించారు. ఈ స్థావరం అభివృద్ధికి చైనా ప్రభుత్వం నిధులను అందజేస్తోంది. ఈ కార్యక్రమంలో కంబోడియా అధికారులతోపాటు.. చైనా దౌత్యవేత్త కూడా పాల్గొన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం సందర్భంగా కంబోడియా అధికారులు మాట్లాడుతూ చైనా నిధులను తాము సద్వినియోగం చేసుకొంటామని పేర్కొన్నారు. కంబోడియా రక్షణశాఖ మంత్రి టి.బెన్హ్‌ మాట్లాడుతూ పశ్చిమదేశాల భయాలను పూర్తిగా కొట్టిపారేశారు. కంబోడియా రాజ్యాంగంలో చెప్పినట్లు బయట దేశాలకు సైనిక స్థావరాలను ఇవ్వడంలేదని పేర్కొన్నారు. ‘‘ మా దేశాన్ని, సార్వభౌమత్వాన్ని, భూభాగాన్ని రక్షించుకోవడానికి ఈ బేస్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవడం చాలా అవసరం’’ అని టి.బెన్హ్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా డ్రైడాక్‌, స్పిల్‌వే వంటి వాటి పనులు చేపట్టనున్నట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చైనా దౌత్యవేత్త వాంగ్‌ వెంటైన్‌ మాట్లాడుతూ ‘‘రెండు దేశాల సైన్యాల మధ్య ఆచరణాత్మకమైన సహకారం సాధ్యమవుతుంది. ఇరు దేశాలది ఉక్కు బంధం. చైనా-కంబోడియా సైనిక సహకారం ఇరు దేశాల, ప్రజల ఆకాంక్ష ’’ అని పేర్కొన్నారు. 

ఆద్యంతం అనుమానాస్పదం..

కంబోడియాలోని రీమ్‌ నౌకాదళ స్థావరంలో చైనాకు కొంత ప్రదేశం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. దీనిలో ఉత్తర భాగాన్ని వాడుకోవాలని 2020 నుంచి చైనా ప్రణాళికలు తయారు చేస్తోంది. ఇక్కడైతే డ్రాగన్‌ ఉనికి గోప్యంగా ఉంటుంది. ఇందుకోసం ఈ నౌకా స్థావరంలో చాలా రోజుల నుంచి విదేశీ వ్యక్తుల కదలికలను కంబోడియా పూర్తిగా నియంత్రిస్తోంది. చాలా చోట్ల చైనా దళాలు యూనిఫామ్‌లో ఉంటున్నాయి. 

బైడూ వ్యవస్థ ఏర్పాటు..

రీమ్‌ నేవల్‌ బేస్‌లో బైడూ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా చైనా దీనిని అభివృద్ధి చేసింది. క్షిపణులను లక్ష్యాల వైపు నడిపించేందుకు ఈ వ్యవస్థను వినియోగించవచ్చు. అంతేకాదు దళాల కదలికలకు కూడా బైడూ ఉపయోగపడుతుందని మార్చిలో పెంటగాన్‌ ఇచ్చిన నివేదిక పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంలోని మిగిలిన దేశాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ సైనిక స్థావరాన్ని వాడుకొనే అవకాశం ఉంది. కీలకమైన సింగపూర్‌ జలసంధికి ఈ కంబోడియా నావికాదళ స్థావరం అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ జలసంధి నుంచి ఏటా 83 వేలకు  పైగా నౌకలు ప్రయాణిస్తుంటాయి. ప్రపంచ సముద్ర రవాణాలో ఇది 40శాతానికి సమానం. దీంతోపాటు అత్యంత కీలకమైన దక్షిణ చైనా సముద్రంలోని దక్షిణ భాగంలో చైనా నౌకలు మోహరించేందుకు అవకాశం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని